Begin typing your search above and press return to search.

అనూహ్యం కాదు అనుకున్నదే: భారత రాష్ట్ర సమితి కన్ఫర్మ్ చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   5 Oct 2022 5:28 AM GMT
అనూహ్యం కాదు అనుకున్నదే: భారత రాష్ట్ర సమితి కన్ఫర్మ్ చేసిన కేసీఆర్
X
అంచనాలే నిజమయ్యాయి. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారన్న పేరున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాను పెట్టబోయే జాతీయ పార్టీ పేరును మంగళవారం రాత్రి డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీ పేరును పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే పేరును టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఖరారు చేయనున్నారు.

ఇదే విషయాన్ని ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం నిర్వహించే మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు. భారత రాష్ట్ర సమితి అన్న పేరు తెలుగు వారితో పాటు.. ఉత్తరాదిన వారికి కూడా ఇట్టే అర్థమవుతుందన్న ఉద్దేశంతోఆ పేరును డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. ‘రాష్ట్ర’ అన్న పదాన్ని హిందీలో దేశం అన్న అర్థంలో వినియోగిస్తారన్న విషయం తెలిసిందే.

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరగటం.. ఈ పేరు ప్రజల్లో బాగా నానిన నేపథ్యంలో ఇదే పేరును కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ పేరును మారుస్తున్న విషయాన్ని తీర్మానంగా ప్రతిపాదిస్తారు. దీనికి పార్టీ తరఫున హాజరవుతున్న 283 మంది సభ్యులు.. కొత్త పార్టీ పేరును ఏకగ్రీవంగా ఆమోదిస్తారని చెబుతున్నారు.

దీనికి సంబంధించిన కీలక దస్త్రం మీద మధ్యాహ్నం 1.19 గంటల సమయంలో సీఎం కేసీఆర్ సంతకం చేస్తారని చెబుతున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు కమ్ ఎంపీ తిరుమలవలవన్ తదితరులు హాజరుకానున్నారు.

పార్టీ పేరు మార్పునకు సంబంధించిన పేపర్ వర్కును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పూర్తి చేసేందుకు వీలుగా.. పార్టీకి చెందిన పలువురు నేతలతో కూడిన టీం గురువారం ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘానికి తమ పత్రాల్ని అందజేయనున్నారు. వీటితో పాటు అఫిడవిట్ కూడా ఇవ్వనున్నారు. పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని నెల పాటు సమయం ఇస్తారు. ఈ లోపు ఎవరూ ఎలాంటి అభ్యంతరం పెట్టకుంటే.. ఆ పేరును కన్ఫర్మ్ చేస్తారని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.