Begin typing your search above and press return to search.

భారతరత్న.. అన్నకా..? అమ్మకా..?

By:  Tupaki Desk   |   20 Dec 2016 11:54 AM GMT
భారతరత్న.. అన్నకా..? అమ్మకా..?
X
కొత్త పోటీ మొదలైంది. తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవమైన ఎన్టీవోడికి భారతరత్నతో గౌరవించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఎన్టీవోడంటే ఏ మాత్రం పడని కాంగ్రెస్ అధికారంలో ఉన్న వేళ.. అంత పెద్ద పురస్కారం రావటం కష్టం కావటంతో.. కాంగ్రెసేతర ప్రభుత్వం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తెలుగోడికి మోడీ సర్కారు కొత్త ఆశల్ని పెట్టుకునేలా చేసింది.

మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే విషయం మీద అడుగు ముందుకు పడలేదన్న వేదన తెలుగోళ్లను పట్టి పీడీస్తున్న వేళ.. ఇప్పుడు అన్నకు పోటీగా అమ్మ తెర మీదకు వచ్చారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తాజాగా ప్రధాని మోడీని కలిసి విన్నవించుకోవటం.. ఆ విషయాన్ని తాము తప్పనిసరిగా పరిశీలిస్తామన్న మాట మోడీ నోటి నుంచి వచ్చింది.

అమ్మకు భారతరత్నతో పాటు.. నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను ప్రధాని మోడీ ముందుకు తీసుకెళ్లారు తమిళనాడు ముఖ్యమంత్రి. దీంతో.. ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారం అన్నకు ముందు వస్తుందా? అమ్మకు వస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

నిజానికి ఎన్టీవోడికి భారతరత్న పురస్కారం ఎప్పుడో రావాల్సింది. మచ్చలేని రాజకీయాల్ని నడపటమే కాదు..పేదల సంక్షేమం కోసం అన్నగారు పడిన తపన అంతాఇంతా కాదు. కాంగ్రెసేతర ప్రభుత్వాల్ని ఏర్పర్చటం పెద్ద కష్టం కాదన్న విషయాన్ని తెలియజేయటమేకాదు.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక గళాన్ని వినిపించటమే కాదు.. అలాంటి రాజకీయ పక్షాల్ని ఒక చోటకు చేర్చటంలో ఎన్టీవోడి ప్రయత్నాల్ని మర్చిపోలేం.

అన్నతో.. అమ్మను పోల్చటం ఏ మాత్రం సరి కాదు. ఎందుకంటే.. జాతీయ రాజకీయాల్లో అన్నగారు ప్లే చేసిన రోల్ ని మర్చిపోలేం. అన్నగారితో పోలిస్తే అమ్మ రోల్ చాలా పరిమితమనే చెప్పాలి. ఇంకాస్త కచ్ఛితంగా చెప్పాలంటే ఆమె హవా అంతా తమిళనాడు రాష్ట్రానికే పరిమితమని చెప్పక తప్పదు.ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమ్మ మీదున్న అవినీతి మరకను కడిగేయటం అంత తేలికైన విషయం కాదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు జీవితాన్ని గడిపిన ఆమె.. అప్పీలుగా బయటకు వచ్చిన ఆమెకు.. కేసులలో క్లీన్ చిట్ రాలేదన్న విషయాన్ని మర్చిపోలేం.

అలాంటి వ్యక్తికి దేశంలో అత్యున్నత పురస్కారం ఇవ్వటమా? అన్న ప్రశ్నకు సమాధానం ఎవరికి వారికి తెలిసిందే. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఎన్టీవోడిని వంకపెట్టే కారణం ఏమీ లేకున్నా.. అన్నగారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ బలమైన కసరత్తు జరిగింది తక్కువనే చెప్పాలి. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి కమ్ టీడీపీ అధినేత చంద్రబాబు వైపు వేలెత్తి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవర్ లో లేనప్పుడు ఆయనేమీ చేయలేరన్నది నిజం. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావటం.. కేంద్రంలో తమ మిత్రపక్షమే పవర్ లో ఉన్న వేళ.. ఎన్టీవోడికి భారతరత్న ఇప్పించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ.. ఎన్టీఆర్ జయంతి రోజునో.. వర్ధంతి రోజునో ఒక డిమాండ్ గా భారతరత్న మాటను ప్రస్తావించటమే తప్పించి.. సీరియస్ గా ఈ ఇష్యూను టేకప్ చేసింది లేదని చెప్పాలి. ఇప్పటికైనా జరిగింది వదిలేసి.. అన్నగారికి భారతరత్న కోసం సీరియస్ గా ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగోళ్ల సుదీర్ఘ స్వప్నాన్ని తీర్చేలా ప్రయత్నాల్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/