Begin typing your search above and press return to search.

భారతరత్న డిమాండ్లు ఎన్నిసార్లు చేస్తారబ్బా ?

By:  Tupaki Desk   |   29 May 2021 4:08 AM GMT
భారతరత్న డిమాండ్లు ఎన్నిసార్లు చేస్తారబ్బా ?
X
మహానటడు, తెలుగుదేశంపార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇచ్చి తీరాల్సిందే అని డిజిటల్ మహానాడులో తీర్మానం చేశారు. ఇప్పటికి ఈ డిమాండ్లు ఎన్సిసార్లు చేశారో లేక్కలేదు. చివరకు ఎక్కడో ఉన్న ఎన్టీయార్ కు కూడా విని విని విసుగొచ్చేసిందేమో. ఎందుకంటే టీడీపీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందే అనే డిమాండ్లు బలంగా వినిపిస్తుంటుంది.

మళ్ళీ అధికారంలో ఉన్నపుడు మాత్రం ఈ డిమాండ్ వినిపించదు. నిజంగానే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం సాధించాలంటే చంద్రబాబునాయుడుకు పెద్ద కష్టంకాదేమో. కానీ తాను అధికారంలో ఉన్నపుడు, కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నపుడు ఎప్పుడు కూడా ఈ డిమాండ్ ఎందుకు వినిపించటం లేదో అర్దం కావటంలేదు.

2014లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నపుడు కూడా ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం డిమాండ్ చేసినట్లు వినబడలేదు. అప్పుడేమో పార్లమెంటులో ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించారు. ఎన్టీయార్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పురంధేశ్వరి కూడా తన తండ్రికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని అడిగినట్లు ఎక్కడా వార్తలు కనబడలేదు.

ఇదే విషయమై ఎన్టీయార్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి మాట్లాడుతు ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం సాధించాలనే చిత్తశుద్ది చంద్రబాబు అండ్ కో లో ఎప్పుడు లేదన్నారు. ఒకవేళ కేంద్రం పురస్కారాన్ని ప్రకటించినా దాన్ని భార్య హోదాలో తాను అందుకోవటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. మరి ఇంతోటిదానికి ఊరికే ప్రతి మహానాడులోను డిమాండ్ చేయటం ఎందుకు ? జనాల్లో పలుచనవ్వటం ఎందుకు ?