Begin typing your search above and press return to search.

ఏడాది చివరికల్లా బయోటెక్ కోవ్యాక్సిన్

By:  Tupaki Desk   |   23 Aug 2020 10:10 AM GMT
ఏడాది చివరికల్లా బయోటెక్  కోవ్యాక్సిన్
X
కరోనా వైరస్ అడ్డుకట్టకు అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలై వున్నాయి. భారత్ లో కూడా మూడు వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నాయి. అందులో కోవ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉంది. ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్లు సిద్ధం అవుతున్నాయని తొందర్లోనే ఓ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ ఈ ఏడాది చివరికల్లా కోవ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇప్పటినుంచి ముమ్మర చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

అయితే మంత్రి కచ్చితంగా ఏ తేదీకి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేది స్పష్టత ఇవ్వలేదు. కోవ్యాక్సిన్ తో పాటు సీరమ్ ఇన్ స్టిట్యూట్ వ్యాక్సిన్ తయారు చేస్తోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇది ఇంకా క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టలేదని, తొందరలోనే మొదలు పెట్టే ఛాన్స్ ఉందని చెప్పారు. జైడుస్ క్యాడిలా తయారు చేస్తున్న జైకోవి -డీ వ్యాక్సిన్ కూడా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని కో వ్యాక్సిన్ తో పాటు ఈ రెండు వ్యాక్సిన్లు కూడా తొందర్లోనే సిద్ధం అవుతాయని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కో వ్యాక్సిన్ ప్రస్తుతం దేశంలో 125 ఆస్పత్రుల్లో 1125 మంది వాలంటీర్ల పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే భారత్లో ఈ ఏడాది ఆఖరుకల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఈ వ్యాక్సిన్ ను ప్రపంచంలోని అన్ని వ్యాక్సిన్ల కంటే తక్కువ ధరల్లో అందించనున్నారు. డోసు తక్కువగా తీసుకుని భుజానికి బదులుగా చర్మపు కింది పొరకు టీకా వేయనున్నారు.