Begin typing your search above and press return to search.

జనసేన ఎఫెక్ట్.. వైసీపీ ఎంపీగా గెలవబోతున్న యంగ్ హీరో

By:  Tupaki Desk   |   9 May 2019 12:18 PM GMT
జనసేన ఎఫెక్ట్.. వైసీపీ ఎంపీగా గెలవబోతున్న యంగ్ హీరో
X
ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ లో హడావిడి ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు ఎండ వేడి.. మరోవైపు రాజకీయ వేడితో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంకా కౌంటింగ్‌ కు రెండు వారాలు మాత్రమే గడువు ఉండడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతుండగా, నేతలు మాత్రం విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఎన్నికల కోసం ఎంతో కష్టపడిన ముఖ్య నాయకులు విశ్రాంతి తీసుకుంటుండగా, పార్టీల శ్రేణులు మాత్రం విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఓ యువ నేత హాట్ టాపిక్‌ గా మారారు. ఇంతకీ ఆయనెవరనే కదా మీ సందేహం..? ఆ యువ నేత మరెవరో కాదు.. రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన మార్గాని భరత్ రామ్.

‘‘ఓయ్ నిన్నే’’ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన భరత్.. బీసీ సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ గా పని చేసిన మార్గాని నాగేశ్వరరావు కుమారుడు. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఈ తండ్రీ కొడుకులు ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి లోకేష్‌ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందినప్పటికీ రాజమహేంద్రవరం టికెట్ దక్కకపోవడంతో ఈ యువ నేత వైసీపీ కండువా కప్పుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో పాటు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉండడంతో జగన్.. పార్టీలో చేరిన వెంటనే భరత్‌ కు టికెట్ కేటాయించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో భరత్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపాదేవి, జనసేన పార్టీ తరపున ఆకుల సత్యనారాయణ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నాయకులు పోల్‌ మేనేజ్‌ మెంట్‌ బాగా చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పటిష్టమైన వ్యూహాలతో, పార్టీ నుంచి వచ్చిన, తాము సొంతంగా సమకూర్చుకున్న ఆర్థిక వనరులతో పక్కా ప్లాన్‌ గా చేసుకున్నారట. దీనికితోడు అక్కడ క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఓటు మాత్రం టీడీపీ, జనసేన, వైసీపీలకు వేసి, ఎంపీ ఓటు మాత్రం భరత్‌ కే వేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీడీపీ అభ్యర్థి రూపా దేవి కూడా ఇదే విషయాన్ని మీడియాతో చెప్పారు. దీంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లైంది. మొత్తానికి జనసేన పోటీలో ఉండడం వల్ల టీడీపీ ఓటు చీలిపోయి భరత్‌ కు ప్లస్ అయిందనే టాక్ వినిపిస్తోంది.