Begin typing your search above and press return to search.

ఎవరీ వైఎస్ భాస్కర్ రెడ్డి? సీఎం జగన్ సతీమణికి ఏమవుతారు?

By:  Tupaki Desk   |   17 April 2023 3:45 PM IST
ఎవరీ వైఎస్ భాస్కర్ రెడ్డి? సీఎం జగన్ సతీమణికి ఏమవుతారు?
X
మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్యలో తాజాగా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని.. రిమాండ్ కు తరలించిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. గడిచిన కొద్ది రోజులుగా ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకుంటారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తగ్గట్లే ఆదివారం తెల్లవారుజుమున పులివెందులలోని ఆయన నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు.. వైఎస్ జగన్ కుటుంబానికి ఉన్న బంధురికం ఏమిటి? సీఎం సతీమణి భారతికి ఆయనకు ఉన్న చుట్టరికం ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడా వివరాల్లోకి వెళితే.. వివేకా హత్య కేసులో అరెస్టు అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి.. సీఎంజగన్ సతీమణి భారతికి సొంత మేనమామ. భారతి తల్లి ఈసీ సుగుణమ్మకు భాస్కర్ రెడ్డి స్వయాన సోదరుడు. అంతేకాదు.. భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీ కూడా భారతికి మేనత్త అవుతారు. అది కూడా బంధురికంలోనే.

అదెలానంటే భారతి తండ్రి గంగిరెడ్డి సోదరే లక్ష్మీ. వీరు కుండ మార్పిడి పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరి బంధురికాలకు సంబంధించి మరింత లోతుల్లోకి వెళితే మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. అయితే.. ఈ వివరాలు మొత్తాన్ని హత్యకు గురైన వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారు. ఆయనేం చెప్పారంటే..

వైఎస్ వెంకటరెడ్డి (ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముత్తాత)కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ కొడుకు చిన్న కొండారెడ్డి. అతడి తొమ్మిదో కొడుకు వైఎస్ భాస్కర్ రెడ్డి. అదేనండి.. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి.

తొమ్మిది మంది సంతానంలో ఆరో కుమార్తె భారతి తల్లి ఈసీ సుగుణమ్మ. ఇక.. రెండో భార్య మంగమ్మ అయిదో కొడుకు వైఎస్ రాజారెడ్డి (జగన్ తాత, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తండ్రి). రాజారెడ్డికి ఇద్దరు కొడుకులు వారిలో ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి.

వైఎస్ భాస్కర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే కాదు ఆయన సతీమణి భారతికి సైతం నేరుగా చుట్టరికం ఉందన్న విషయం అర్థమవుతుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి సీఎం జగన్ కు వరుసకు చిన్నాన్న అవుతారు. జగన్ భార్య భారతికి మేనమామ అవుతారు. వైఎస్ భారతి తల్లి ఈసీ సుగుణమ్మ.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మేనత్త అవుతారు. అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మి.. భారతికి మేనత్త అవుతారు.