Begin typing your search above and press return to search.

కేటీఆర్ ట్వీట్ పెట్టే వరకు తెలీకపోవటం ఏమిటి భట్టి?

By:  Tupaki Desk   |   14 Aug 2020 7:45 AM GMT
కేటీఆర్ ట్వీట్ పెట్టే వరకు తెలీకపోవటం ఏమిటి భట్టి?
X
రాష్ట్రం ఏదైనా కావొచ్చు. ప్రధాన ప్రతిపక్షం ఎలా ఉండాలి? డేగలా అవకాశం కోసం కాచుకొని ఉండాలి. అధికారపక్షం చేసే తప్పుల్ని.. గుట్టుచప్పుడు కాకుండా.. మూడో కంటికి తెలీకుండా చేసే అంశాల్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. కానీ.. ఈ నిఘా తెలంగాణ కాంగ్రెస్ లో బాగా తగ్గిపోయిందని చెప్పాలి. అదిప్పుడు ప్రమాదకర పరిస్థితికి చేరుకుందన్న విషయం సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క మాటల్ని చూస్తేనే అర్థమవుతుంది.

కరోనా వేళ తెలంగాణ రాష్ట్ర కిందామీదా పడుతుంటే.. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి.. పుడ్ ప్రాసెసింగ్.. లాజిస్టిక్ పాలసీ లాంటి అంశాల మీద సమీక్ష జరపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు భట్టి. ఈ మాటలు వరకు ఓకే.. ఆ తర్వాత చెప్పే మాటల మీదే అభ్యంతరమంతా. ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగిందన్న వార్తలు తమకు ఆశ్చర్యాన్ని కలుగుచేస్తున్నాయని.. దేశంలో ఇలాంటి పరిస్థితి మరెక్కడా లేదని వ్యాఖ్యానించారు.

ఈ విషయాలన్ని మీడియాకు విడుదల చేసిన ఒక నోట్ లో ఉండటం గమనార్హం. ఓపక్క సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీట్ పెట్టి.. సీఎం ఆదేశాల మేరకు సమీక్ష పెట్టినట్లుగా పేర్కొని.. ఎనిమిది గంటల పాటు సాగిందని చెప్పేస్తున్న వేళ.. కేబినెట్ సమావేశం జరిగిందన్న వార్తలు వస్తున్నాయని భట్టి చెప్పటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

వాస్తవానికి బుధవారం జరిగిన సమావేశం గురించి అదే రోజు స్పందించి.. ఇదేం పద్దతి? అని నిలదీయాల్సిన అవసరం ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాతో.. దానికి కంటే కాస్త ముందే తెలిసిందనుకుందాం. అలా చూసినా తప్పే అవుతుంది కదా? ప్రగతిభవన్ లో రివ్యూ మీటింగ్.. అది కూడా సీఎం లేకుండా అన్న విషయం సామాన్యులకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ.. ప్రదానప్రతిపక్షంలోని కీలక నేతలకు అలాంటి సమాచారం అందటం లేదంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతల నెట్ వర్క్ ఎంత వీక్ అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు రాకపోతే టీ కాంగ్రెస్ ఫ్యూచర్ సందేహమే.