Begin typing your search above and press return to search.

కాళేశ్వ‌రం ఓపెనింగ్ కు వెళితే జ‌గ‌న్ పెద్ద త‌ప్పు చేసిన‌ట్లా?

By:  Tupaki Desk   |   15 Jun 2019 6:17 AM GMT
కాళేశ్వ‌రం ఓపెనింగ్ కు వెళితే జ‌గ‌న్ పెద్ద త‌ప్పు చేసిన‌ట్లా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు కాళేశ్వ‌రం ప్రారంభోత్స‌వానికి ఎట్టి ప‌రిస్థితుల్లో రావొద్దంటూ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కోరుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జ‌గ‌న్ వ‌స్తే.. ఆయ‌న తండ్రి ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన‌ట్లు అవుతుందని చెబుతూ.. పాత విష‌యాల్ని గుర్తు చేస్తున్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఓపెనింగ్ కు వ‌స్తే.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసింది త‌ప్పు అవుతుంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క చెబుతున్న మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. తెలంగాణ‌లోని ఏడు జిల్లాల‌కు తాగు..సాగునీరు.. పారిశ్రామిక అవ‌స‌రాల కోసం రూ.38 వేల కోట్ల‌తోనే ప్రాణ‌హిత‌- చేవెళ్ల ప్రాజెక్టును నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి డిజైన్ చేసిన వైనాన్ని గుర్తు చేశారు.

ఆ డిజైన్ వెనుక తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న‌ష్టం చేసే కుట్ర దాగి ఉందంటూ కేసీఆర్ ఆ ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. కాళేశ్వ‌రంగా పేరు మార్చిన ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి జ‌గ‌న్ ను ఏమ‌ని చెప్పి పిలుస్తారు? అంటూ భ‌ట్టి ప్ర‌శ్నించారు. వైఎస్ చేసింది త‌ప్పు.. కేసీఆర్ చేసింది రైటు అని జ‌గ‌న్ చేత చెప్పించ‌టానికి ప్రారంభోత్స‌వానికి పిలుస్తున్నారా? అంటూ క్వ‌శ్చ‌న్ చేసిన భ‌ట్టి..కాళేశ్వ‌రం కార్పొరేష‌న్ ద్వారా తెచ్చిన నిధులు.. అప్పుడు స‌మ‌ర్పించిన డీపీఆర్ త‌దిత‌రాల్ని సాగునీటి శాఖ వెబ్ సైట్ లో ఉంచాల‌ని.. ఎమ్మెల్యేల‌కు ఆ స‌మాచారాన్ని ఇవ్వాల‌న్నారు.

వైఎస్ త‌ల‌పెట్టిన ప్రాణ‌హిత‌-చేవెళ్ల ప్రాజెక్టు కొన‌సాగాల‌ని.. చేవెళ్ల‌కు నీళ్లు రావాలంటూ పాద‌యాత్ర‌లు చేసిన స‌బిత సైతం కాళేశ్వ‌రం వ‌ల్ల న‌ష్ట‌పోతున్న వైనాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. ఆమె కానీ అలా చేయ‌కుంటే చేవెళ్ల‌కు నీళ్లు కోసం ఆమె చేసిన ప్ర‌య‌త్నం వృధా అవుతుంద‌న్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు కామ‌ధేనువుగా మారింద‌న్నారు. రీడిజైన్ చేసిన కాళేశ్వ‌రానికి మూడేళ్ల‌లో రూ.50వేల కోట్లు ఖ‌ర్చు అయిన‌ట్లుగా లెక్క‌లు చెబుతున్నాయ‌ని.. మ‌రో రూ.50వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌టానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. ప్రాణ‌హిత ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ.38వేల కోట్లు అని.. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే రూ.10వేల కోట్లు ఖ‌ర్చు చేశార‌ని గుర్తు చేశారు. భ‌ట్టి నోటి నుంచి ఇన్ని మాట‌లు వ‌చ్చిన త‌ర్వాత‌.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఓపెనింగ్ కు జ‌గ‌న్ వెళ‌తారా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క‌తప్ప‌దు.