Begin typing your search above and press return to search.

కెసిఆర్ కు మెగలోనియా వ్యాధి??

By:  Tupaki Desk   |   26 Oct 2016 8:44 AM GMT
కెసిఆర్ కు మెగలోనియా వ్యాధి??
X
రాజకీయ విమర్శల్లో క్రియేటివిటీ పెరిగిపోతోంది. మీడియా ప్రాబల్యం పెరిగిపోయిన తరువాత ఏదైనా కొత్తగా విమర్శిస్తే మరింత బాగా హైలైట్ అవుతామన్న కాన్సెప్టు అందరికీ ఒంటబట్టేసింది. అందుకే కొత్తకొత్త విమర్శలతో నేతలు దూకుడు మీదున్నారు. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డంలో ఒక్కొక్క‌రిదీ ఒక్కో పంథా. స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ఒక‌రు సాక్ష్యాధారాల‌తో ఇరుకున పెడ‌తారు. మ‌రికొంద‌రు మాట‌ల‌తో ఇబ్బంది పెడ‌తారు. మొత్తానికి ప్ర‌భుత్వానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం వీరి ల‌క్ష్యం. అందుకే, సూటిమాట‌ల‌తో.. చురుక్కుమ‌నే ప‌దాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల యుద్ధం చేస్తుంటారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు భట్టి విక్ర‌మార్క ఇదే కోవ‌కు చెందుతారు. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించాల్సి వ‌చ్చిన ప్ర‌తిసారీ ఈయ‌న త‌న‌దైన మాట తీరు ప్ర‌దర్శిస్తారు. తాజాగా కేసీఆర్‌ కు మెగ‌లోమేనియా అనే వ్యాధి ఉంద‌ని చుర‌క‌లంటించారు.

భట్టి మెగలోనియా వ్యాధి పేరు చెప్పగానే మీడియా ప్రతినిధులు షాకయ్యారట. తామెప్పుడూ అలాంటి పేరు వినలేదని... ఇంత‌కీ మెగ‌లోమేనియా అంటే వైద్య‌ప‌రిభాష‌లో అర్థ‌మేంటి? అని విలేక‌రులు జుట్టు పీక్కున్నారు. అంత‌లోనే భ‌ట్టి వారికి అస‌లు విష‌యం వివరించారు. మెగ‌లోమేనియా అంటే ఒక మాన‌సిక జ‌బ్బు అని వెల్ల‌డించారు. ఈ వ్యాధి వ‌స్తే.. చుట్టుప‌క్క‌ల అస్స‌లు బాగాలేకున్నా.. అంతా బాగున్న‌ట్లు భ్ర‌మ‌లో బ్ర‌తికేస్తారు అని అస‌లు విషయం చెప్ప‌క‌నే చెప్పారు.

రాష్ట్రంలో ఏ సంక్షేమ ప‌థకం స‌రిగా అమ‌లుకాకున్నా.. ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నా.. రాష్ట్రం అప్పులు పెరిగిపోతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం అంతా బాగుంద‌నే భ్ర‌మ‌లో ఉన్నార‌ని విమ‌ర్శించారు. త‌న‌కు తాను ఏదో స‌ర్వేలు చేసుకుని త‌మ ప‌రిపాల‌న బాగుంద‌ని జ‌బ్బ‌లు చరుచుకోవ‌డమే ఇందుకు ఉదాహ‌ర‌ణ అని చుర‌క‌లంటించారు. రాష్ట్రంలో రైతులు న‌కిలీ విత్త‌నాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అదేం లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా ఉన్న‌ సెక్రటేరియ‌ట్ ను కూల్చి కొత్త‌ది క‌డ‌తామన‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా వార్త పతాక శీర్షికల్లో రావాలంటే ఈ మాత్రం హోం వర్కు చేయక తప్పదు మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/