Begin typing your search above and press return to search.

పాతాళభైరవి.. ఫాంహౌస్.. కేసీఆర్.. భట్టి.. ఈ లింకులేంటి?

By:  Tupaki Desk   |   19 May 2021 3:18 AM GMT
పాతాళభైరవి.. ఫాంహౌస్.. కేసీఆర్.. భట్టి.. ఈ లింకులేంటి?
X
రాష్ట్రం ఏదైనా అధికారపక్షం బలంగా ఉంటేనే సరిపోదు. విపక్షం బలంగా ఉంటే.. అక్కడి రాజకీయం వేరుగా ఉంటుంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే తెలంగాణలో.. గడిచిన కొద్దికాలంగా విపక్షం చేష్టలుడిగినట్లుగా ఉండటం తెలిసిందే. దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా.. సెక్రటేరియట్ కు వెళ్లకుండా.. ఫాంహౌస్ నుంచే పాలన సాగించే సీఎం ఉన్నప్పటికి.. దాన్ని ఎండగట్టే విషయంలో తెలంగాణ విపక్షం ఫెయిల్ అయ్యిందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

అధికారపక్షం ఎన్ని అవకాశాలు ఇచ్చినా అందిపుచ్చుకోలేకపోతున్న కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు మాత్రం మెరుపులు మెరిపిస్తుంటారు. మొదట్లో తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అదే పనిగా కేసీఆర్.. కేటీఆర్ మీద విరుచుకుపడుతుండేవారు. తర్వాతేమైందో కానీ కాస్త తగ్గటం కనిపిస్తుంది. రేవంత్ తో పాటు.. ఘాటైన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తాజాగా ఆయన నోటికి పని చెప్పారు. కరోనా ఎపిసోడ్ లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పాతాళ భైరవి సినిమాలో మాదిరి అప్పుడప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వస్తారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కరోనా పెరుగుతున్న సమయంలో చీఫ్ సెక్రటరీకి తాను ఫోన్ చేసి మాట్లాడానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందని.. దున్నపోతు మీద వాన పడుతున్నా కదిలే పరిస్థితి లేదని.. ఫాంహౌస్ లో నిద్రిస్తోందని చెప్పానన్నారు. మంత్రులెవరూ స్పందించటం లేదని.. కనీసం బ్యూరోక్రసీతో పని చేయటం మీబాధ్యత అని సీఎస్ కు చెప్పి పదిహేను రోజులైనా ఆయన ఇప్పటివరకు స్పందించలేదన్నారు.

కరోనా నేపథ్యంలో పూర్తిస్థాయి ఆరోగ్య మంత్రి ఉండదలని.. అందుకు భిన్నంగా రోజుకొకరు గెస్ట్ యాక్టర్ల మాదిరి సమావేశాలు పెట్టటం ఏమిటని ప్రశ్నించారు. సోనూసూద్ మాదిరి తెలుగు సినిమా హీరోలు.. హీరోయిన్లు.. ఆర్టిస్టులు.. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి కరోనా బాధితులకు అండగా నిలవాలన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రం ఇప్పటివరకు నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకోలేదన్నారు. మంత్రి కేటీఆర్ ను టాస్కు ఫోర్సు కమిటీ ఛైర్మన్ గా నియమించిన తర్వాత కరోనా వ్యాక్సిన్ రాష్ట్రంలో పూర్తిగా బంద్ అయ్యిందన్నారు. చాలా రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చురుకు పుట్టేలా భట్టి మాట్లాడారని చెప్పాలి.