Begin typing your search above and press return to search.

చింత‌మ‌నేనికి మూడేళ్ల జైలుశిక్ష

By:  Tupaki Desk   |   14 Feb 2018 7:57 AM GMT
చింత‌మ‌నేనికి మూడేళ్ల జైలుశిక్ష
X
ఏపీ అధికార‌ప‌క్ష నేత చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కు ఒక కేసులో ఆర్నెల్లు జైలుశిక్ష విధించిన వైనం తెలిసిందే. అయితే.. మ‌రికొన్ని కేసుల్లో మొత్తంగా ఆయ‌న‌కు మూడేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇవ్వ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. త‌ర‌చూ త‌న వివాదాస్ప‌ద వైఖ‌రితో వార్త‌ల్లోకి ఎక్కే చింత‌మ‌నేని.. రాజ‌కీయ నేత‌లు మొద‌లు అధికారుల వ‌ర‌కూ అంద‌రిపైనా చేయి ఎత్తుతార‌న్న ఆరోప‌ణ ఉంది. గ‌తంలో ఒక మ‌హిళా అధికారిపై దాడికి దిగ‌టం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా మూడు వేర్వేరు కేసుల‌కు సంబంధించి భీమ‌డోలు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ మూడు కేసుల‌తో క‌లిపి మొత్తంగా మూడేళ్లు జైల‌శిక్ష విధిస్తూ న్యాయ‌మూర్తి సంచ‌ల‌న తీర్పును ఇచ్చారు. ఈ తీర్పు అధికార‌పార్టీలో హాట్ టాపిక్ గా మార‌గా.. ఏపీలో ఇప్పుడో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

2011 జూన్ లో దెందులూరు హైస్కూల్లో జ‌రిగిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో అప్ప‌టి మంత్రి హోదాలో ఉన్న వ‌ట్టి వ‌సంత‌కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో వట్టి వ‌సంత‌కుమార్ గ‌న్ మెన్ పై చేయి చేసుకున్న ఆరోప‌ణ‌లు చింత‌మ‌నేనిపై ఉన్నాయి. దీనికి సంబందించి న‌మోదైన కేసులో ప్ర‌స్తుతం దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింత‌మ‌నేనిని దోషిగా నిర్ధారించారు.

మంత్రి వ‌ట్టి వ‌సంత‌కుమార్ తో పాటు.. ఎంపీ కావూరిపైనా దౌర్జ‌న్యం చేసిన కేసుల‌కు సంబంధించి తీర్పులిచ్చిన కోర్టు.. ఈ కేసుల్లో ఎమ్మెల్యే నేరం రుజువైంద‌న్నారు. మొత్తం మూడు కేసుల‌కు క‌లిపి మూడేళ్లు జైలుశిక్ష విధించిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ శిక్ష‌ను అమ‌లు చేస్తే రెండేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. తాము వెలువ‌రించిన తీర్పుల్ని ఏకకాలంలో అమ‌లు చేయాల‌ని తేల్చారు. ఈ తీర్పు వెలువ‌రించే స‌మ‌యానికి త‌న అనుచ‌రుల‌తో కోర్టుకు హాజ‌రైన చింత‌మ‌నేని.. బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ జ‌డ్జి నిర్ణ‌యం తీసుకున్నారు. అధికార‌పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఉన్న మూడు కేసుల్లో దోషిగా తీర్పునివ్వ‌టం సంచ‌ల‌నంగా మారింది.