Begin typing your search above and press return to search.

భీమవరం ఆత్మాభిమానం దెబ్బ తీసేలా జోకులా?

By:  Tupaki Desk   |   10 Jan 2016 11:30 AM GMT
భీమవరం ఆత్మాభిమానం దెబ్బ తీసేలా జోకులా?
X
మాటలతో మనోభావాలు దెబ్బ తినటం.. ఆత్మాభిమానాన్ని భంగం వాటిల్లటం లాంటివి ఎవరికి తెలిసినా తెలీకున్నా.. టీఆర్ ఎస్ పార్టీకి చాలా బాగా తెలుసు. ఆత్మాభిమానం అనే మాటతో తెలంగాణ ఉద్యమాన్ని సరికొత్త మలుపు తిరిగేలా.. తెలంగాణ ప్రజలు ఏకమయ్యేలా చేసింది. యాసను అవమానిస్తారా? అంటూ ఆవేశంతో ప్రశ్నించటం.. ప్రతి విషయంలో తక్కువ చేసి చూపించటం.. అవమానించటం ఏమిటంటూ టీఆర్ ఎస్ నేతలు తరచూ ప్రశ్నించే వారు.

కించపరిచే మాటలతో తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసినట్లుగా ఆరోపించే గులాబీ నేతలు.. మరి.. మరో ప్రాంతానికి చెందిన ప్రజల మనోభావాలు.. ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయొచ్చా? అన్నది ప్రశ్న. ఈ మధ్య తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని తాము తెలుగు రాష్ట్ర సమితి పార్టీగా మార్చాలని భావిస్తున్నామని.. ఒకవేళ అదే జరిగితే తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు.

తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని.. అక్కడ గెలవటానికి సింఫుల్ ట్రిక్ ఉందని.. కోడి పందేలు లీగలైజ్ చేస్తామని చెబితే చాలు.. గెలిచేస్తామంటూ వ్యాఖ్యానించారు. దీనిపై విపక్షాలు విమర్శించిన నేపథ్యంలో తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను సరదాగా జోకేస్తే ఇంత రార్థాంతం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఒక ప్రాంతానికి చెందిన ప్రజల్ని చులకన చేసేలా వ్యాఖ్యలు చేయటం జోకా? కోడి పందాలు లీగలైజ్ చేస్తామంటే చాలు ఓట్లు గుద్దేస్తామనటం చూస్తే.. భీమవరం ప్రజలు అంత అలుసుగా కనిపిస్తున్నారా? కోడి పందాలే తప్ప మరింకేమీ పట్టవన్నట్లుగా చిన్నబుచ్చేలా కేటీఆర్ ఎలా మాట్లాడతారు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరికొందరైతే.. బాధితులమని వాపోతూ.. తమపై ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తారా? అని ఒకప్పుడు ప్రశ్నించిన కేటీఆర్ లాంటి వారే ఇప్పుడు భీమవరం వాసుల్ని చిన్నబుచ్చుతూ.. అవమానించేలా వ్యాఖ్యలు చేయటం ఏమిటని మండిపడుతున్నారు. సరదాగా జోకులేసుకోవటానికి భీమవరం వాసులే దొరికారా? వారు అంత తేలిగ్గా కనిపిస్తున్నారా? అంటూ పలువురు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.