Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: భీమిలీలో గెలుపెవరిది?

By:  Tupaki Desk   |   26 March 2019 5:38 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: భీమిలీలో గెలుపెవరిది?
X
అసెంబ్లీ నియోజకవర్గం: భీమిలీ

టీడీపీ: సబ్బం హరి
వైసీపీ: అవంతి శ్రీనివాసరావు

స్వాతంత్య్ర పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డగా భీమిలి నియోజకర్గానికి ప్రత్యేకత ఉంది. అలాగే విశాఖ జిల్లాలోనూ కీలకంగా ఉన్న ఈ సెగ్మెంట్‌లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకే టికెట్‌ అనుకున్న సమయంలో చివరి నిమిషంలో ఆయన ఓడిపోతానని తెలుసుకొని విశాఖ ఉత్తరం నియోజకవర్గానికి మారాడు. దీంతో ఇటీవలే టీడీపీలో చేరిన అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరికి భీమిలీ అసెంబ్లీ సీటును టీడీపీ కేటాయించింది. ఇక గంటాతో విభేధించి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. నియోజకవర్గానికి ఇద్దరు కొత్త అభ్యర్థులే కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇక వీరితోపాటు జనసేన నుంచి భీమిలీలో పంచకర్ల సందీప్ ఎన్ని ఓట్లు చీల్చుతాడనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.

* భీమిలి నియోజకవర్గం చరిత్ర:

భీమిలి నియోజకవర్గంలో మండలాలు: ఆనందపురం - పద్మనాభం - భీమినిపట్నం - విశాఖ రూరల్‌
ఓటర్లు: 2 లక్షల 70వేలు

ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి. మొదట స్వతంత్య్ర అభ్యర్థులు - ఆ తరువాత కాంగ్రెస్‌ నాయకులు విజయం సాధిస్తూ వచ్చారు. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత పోషపాటి ఆనందగజపతిరాజు విజయం సాధించారు. వరుసగా నాలుగుసార్లు పసుపు జెండా ఎగిరినా రెండుసార్లు టీడీపీ ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడతో పాటు యాదవ్‌ - మత్స్యకారులు ఇక్కడ గెలుపొటములను నిర్ణయిస్తారు.

* టీడీపీ నుంచి సబ్బం హరికి కష్టమే..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి కుడిభుజంగా ఉన్న సబ్బం హరి కాంగ్రెస్‌ లో కీలక నేతగా ఎదిగారు. 2009లో అనకాపల్లి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన నియోజకవర్గంలో పట్టున్న నేతగా ఎదిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ దాదాపు తుడిచిపెట్టుకుపోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సబ్బం హరి ఓడిపోయారు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీలో చేరారు. దీంతో ఆయనకు చంద్రబాబు భీమిలి టికెట్‌ కేటాయించారు.

* అనుకూలతలు:

- కాంగ్రెస్‌ లో కీలక పదవులు అనుభవించడం
- టీడీపీకి కంచుకోట కావడం
- టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు

* ప్రతికూలతలు:

-టీడీపీ భీమిలీలో ఓడిపోతుందని సర్వే రిపోర్టు
-నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి కావడంతో గెలుపుపై అనుమానం

* అవంతి శ్రీనివాసరావు గెలుపు పక్కేనా?

మంత్రి గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు - విద్యాసంస్థల అధిపతి అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాన్‌ అవంతి శ్రీనివాస్‌.. గంటా అండదండలతో 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో 42వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారి ఎంపీ అయిన అవంతి నియోజకవర్గ సమస్యలతో పాటు విభజన సమస్యలను లోక్‌ సభలో ప్రస్తావించారు. వివిధ అంశాలకు సంబంధించి 264 ప్రశ్నలు అడిగా పేరు తెచ్చుకున్నారు. గంటాతోపాటు మంచి పట్టున్న నేతగా ఎదిగారు. అవంతికి భీమిలీలో గట్టి పట్టు ఉంది. అవంతి వల్లే గంటా ఇక్కడ గెలిచారు. కానీ ఇప్పుడు అవంతి వైసీపీలో చేరి ఇక్కడ పోటీచేస్తున్నారు. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన వైసీపీలో చేరి తన గురువుకు వ్యతిరేకంగా పోటీపడుతున్నారు. ఇక్కడ అవంతి గెలుపు ఈజీ అన్న చర్చసాగుతోంది.

* అనుకూలతలు:

-నియోజకవర్గంలో విద్యాసంస్థల ద్వారా పేరు ప్రఖ్యాతలు
-ఎంపీగా నియోజకవర్గ ప్రజల్లో ఆదరణ
-ప్రత్యేక హోదా విషయంలో పోరాడడం
-స్థానికంగా గట్టి పట్టు - క్యాడర్ - బలం..

* ప్రతికూలతలు

-టీడీపీ కంచుకోటగా భీమిలీ ఉండడం
-పార్టీ కేడర్‌ లేకపోవడం

*అవంతికే మొగ్గు

ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాసరావు మంత్రి పదవి కూడా అనుభవించారు. అయితే నియోజకవర్గంపై చిన్నచూపు చూడడంతో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని ప్రచారం జరిగింది. అందుకనే ఆయన గెలువడనే కోణంతో ఇక్కడ నుంచి విశాఖ ఉత్తరానికి వెళ్లాడు. కొత్త అభ్యర్థిని పార్టీ అధినేత బాబు ఇక్కడ దించాడు. దీనిని ప్రచారం చేస్తూ ఆవంతి శ్రీనివాస్‌ దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వైసీపీ గాలి వీస్తుండడంతో ఆవంతికే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి సబ్బం హరి చివరి నిమిషంలో టికెట్ చేజిక్కించుకోవడం.. టీడీపీ కేడర్ ఆయనకు సహకరించే పరిస్థితి లేదట.. బయట నుంచి సబ్బం హరిని తీసుకెళ్లడంతో టీడీపీ కేడర్ ఆయన్ను వ్యతిరేకిస్తోంది. 20 రోజులు కూడా లేని ఎన్నికల సమయంలో సబ్బం హరి ఏమేరకే పోటీనిస్తాడన్నది అనుమానంగా మారింది.