Begin typing your search above and press return to search.

మోడీపై ఆయన పోటీ చేయడం లేదు..?

By:  Tupaki Desk   |   18 April 2019 5:55 AM GMT
మోడీపై ఆయన పోటీ చేయడం లేదు..?
X
ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి అంటే తెలియని వారుండరు. ఆధ్యాత్మికతకు ఆలవాలంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి మోడీ ఎంపీగా పోటీచేయడంతో మరింత పాపులారిటీ సంపాదించింది. ఐదేళ్లలో ఆయన వారణాసి రూపురేఖలు మార్చేశారు. ఈసారి కూడా మోడీ మరోసారి ఇక్కడినుంచే బరిలో దిగారు. చివరిదశ ఎన్నికల్లో భాగంగా మే నెల 19న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మోడికి తిరుగులేదని, మరోసారి ప్రభంజనం సృష్టిస్తారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి..

ఇక మోడీని ఎదుర్కొనేందుకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దించాలని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ఆలోచిస్తోంది. ఒక దశలో సోనియాగాంధీ కుమార్తె - రాహుల్‌ చెల్లెలు ప్రియాంకా గాంధీని పోటీకి నిలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రియాంకాగాంధీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రంలోనే సోనియా, రాహుల్‌ పోటీ చేసే నియోజకవర్గాలు ఉండడంతో పాటు ఎక్కువ లోక్‌ సభ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రం కాబట్టి కాంగ్రెస్‌ ప్రధాన నాయకులంతా ఇక్కడే దృష్ఠి సారించారు.

మరోవైపు బీఎస్పీ - ఎస్పీలు కలిసి వారణాసిలో అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తున్నాయి. అయితే అనూహ్యంగా భీం ఆర్మీ చీఫ్‌ గా ఉన్న ఆజాద్‌ మోడీకి పోటీగా ఉంటానని గత నెలలో ప్రకటించారు. తాజాగా ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను పోటీలో లేకున్నా మోడీని ఓడించడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రధానిని ఓడించడమే లక్ష్యంగా బీమ్‌ ఆర్మీ - బీఎస్సీ - ఎస్పీలు పనిచేస్తాయని చెప్పారు. మరోవైపు ఎస్పీ - బీఎస్పీల అభ్యర్థిగా మిశ్రాను బరిలోకి దించాలని సూచించారు. దీంతో అగ్రవర్ణాల ఓట్లు కూడా పడుతాయని చెప్పారు.

అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి... ఆజాద్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆజాద్‌ మోడీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని విమర్శించారు. బీఎస్పీ, ఎస్పీల అభ్యర్థిని ఎవరిని బరిలో దించాలో ఆజాద్‌ సూచించాల్సిన అవసరం లేదన్నారు. దళితుల ఓట్లు మోడీకి వేసేలా ఆజాద్‌ పనిచేస్తున్నాడని మాయావతి ఆరోపించారు. త్వరలో మా పార్టీల తరుపున అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.