Begin typing your search above and press return to search.

భీమ్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ లో తారాస్థాయికి నియంతృత్వం

By:  Tupaki Desk   |   27 Jan 2020 6:28 AM GMT
భీమ్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ లో తారాస్థాయికి నియంతృత్వం
X
తన మాటలతో.. వాదనలతో దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకోవటంతోపాటు.. బడుగు.. బలహీనవర్గాలకు.. దళిత ఉద్యమానికి కొత్త గొంతుకగా మారిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ తెలంగాణ సర్కారు పై అజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు. హైదరాబాద్ లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హైదరాబాద్ కు వచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకోవటంతో పాటు.. నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల కు తిప్పారు.

తన ప్రసంగాన్ని అడ్డుకోవటమే కాదు.. తాను పాల్గొనాల్సిన నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆయన పాల్గొనాల్సిన వేదిక వద్దకు రాక ముందే ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన ఎక్కడ ఉన్నది.. తాము అదుపులోకి తీసుకున్నది ఎక్కడ సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులు వెల్లడించలేదు. ఆయనతో పాటు.. ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

తనను బలవంతంగా తిరిగి హైదరాబాద్ నుంచి ఢిల్లీ కి పంపుతున్నట్లుగా చంద్రశేఖర్ అజాద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తెలంగాణలో నియంతృత్వం తారా స్థాయికి చేరుకుందని.. తనకు హైదరాబాద్ లో ఎదురైన అవమానాన్ని తాను మర్చిపోలేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మళ్లీ వస్తానని చెప్పిన ఆయన.. తనను ఇప్పుడు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చి ఢిల్లీ కి పంపుతున్నట్లుగా వెల్లడించారు.

బహుజన్ సమాజం తనకు ఎదురైన అవమానాన్ని మర్చిపోలేదంటూ ట్వీట్ చేసిన ఆయన.. త్వరలోనే మరోసారి తాను తెలంగాణకు వస్తానని చెప్పారు. పౌరసత్వసవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు ఢిల్లీ పోలీసులు ఆయన్నుజామా మసీదు వద్ద అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైల్లో ఉంచారు. అనంతరం విడుదలైన ఆయన..

మరోసారి జామా మసీదు వద్దకు వెళ్లి అక్కడ రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. తాను జామా మసీదుకు రావటానికి ముందు దేవాలయం..గురు ద్వారాలను దర్శించుకొని వచ్చినట్లు గా వెల్లడించారు. ఏమైనా.. చంద్రశేఖర్ అజాద్ ను హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో తిప్పి.. ఆయన ఆచూకీకి సంబంధించిన వివరాల్ని వెల్లడించకుండా చేయటంలో హైదరాబాద్ పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పాలి.