Begin typing your search above and press return to search.

అఖిల‌ప్రియ మాట..నన్ను వైసీపీ గెలిపించ‌లేదు

By:  Tupaki Desk   |   20 Aug 2017 4:55 PM GMT
అఖిల‌ప్రియ మాట..నన్ను వైసీపీ గెలిపించ‌లేదు
X
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో దివంగ‌త భూమానాగిరెడ్డి - శోభా నాగిరెడ్డి త‌న‌య‌ - ఏపీ మంత్రి అఖిల ప్రియ ఆమె సోద‌రి మౌనికా రెడ్డి ఓ టీవీ చాన‌ల్‌ తో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ అనేక అంశాల‌పై స‌వివ‌రంగా స్పందించారు. నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయ‌మ‌ని మంత్రి అఖిల ప్రియ ధీమా వ్యక్తం చేశారు. రూ.1500 కోట్లు కుమ్మరించి అభివృద్ధి చేస్తున్నామ‌ని...30 ఏళ్ల పాటు నంద్యాల ప్రజలు వెనక్కి తిరిగి చూసుకునే పనిలేదని అఖిల‌ప్రియ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో స్పీకర్ పోడియం చుట్టూ మూగడం తప్ప ఇంకేం జరగలేదని ఆమె అన్నారు. త‌మ తండ్రి చనిపోయినప్పుడు కార్యకర్తల్లో భయాన్ని చూశానని... వారికి ధైర్యం చెప్పేందుకు తాను అసెంబ్లీకి వెళ్లానని అఖిల‌ప్రియ తెలిపారు. ప్రజలకు త‌మ‌ జీవితాలు అంకితం చేసేశామ‌ని ప్ర‌క‌టించారు. పదవి కోసమే నాన్న చనిపోయిన మర్నాడే అసెంబ్లీకి వెళ్లానన్నది కరెక్ట్ కాదని అఖిల ప్రియ అన్నారు.

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయడం పెద్ద పని కాదని అఖిల‌ప్రియ తెలిపారు. తాము టీడీపీలో చేరిన తర్వాత ఏ ఒక్క సర్పంచ్ గానీ - జడ్పీటీసీ - ఎంపీటీసీ - కౌన్సిలర్ గానీ ఆళ్లగడ్డలో పార్టీ మారింది లేదని..దీంతో తాము తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని దానికే క‌ట్టుబ‌డి ఉండి అందుకే రాజీనామా చేయాల్సిన అవసరం రాలేదని అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బ‌రిలో నిలిచిన స‌మ‌యంలో త‌ను ఆ పార్టీకి చెందిన ఓట్ల‌తో గెలవలేదని...భూమా బ్రాండ్ తోనే గెలిచాన‌ని ప్ర‌క‌టించారు. 2019లో ఎలాగో ఎన్నికలకి వెళ్తామ‌ని అప్పుడు ఎవ‌రేంటో తెలుస్తుందని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు. నంద్యాల‌లో త‌మ‌ను టార్గెట్ చేయడానికి జగన్ ప్రచారం చేస్తున్నారా? లేక శిల్పా మోహన్ రెడ్డి ని గెలిపించుకోవడానికి ప్రచారం చేస్తున్నారో అర్ధం కావడం లేదని అఖిలప్రియ ఎద్దేవా చేశారు. నాగిరెడ్డిపై కేసులు పెట్టి ఆయన చావుకి కారణమైన శిల్పా ఫ్యామిలీ కోసం జగన్ ప్రచారం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు శిల్పా చేసిన అభివృద్ధి పనులు ఆయనకే గుర్తు రావడం లేదని అఖిల‌ప్రియ‌ ఎద్దేవా చేశారు. తాము రాజకీయంగా ఎవర్ని ఇబ్బంది పెట్టలేదని అఖిల‌ప్రియ తెలిపారు. ప్రతి రోజు ఓ సమస్యతో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటున్నానని తెలిపారు. శిల్పా బ్రదర్స్ బయటకి వెళ్లడంతో స్వచ్చందంగా వచ్చి మాకు మద్దతు తెలిపేవారు ఎక్కువయ్యారని అఖిల‌ప్రియ వివ‌రించారు.

తాము చిన్నపాటి నుంచి ప్ర‌జా జీవితంలో ఉన్నామ‌ని...పదవులు లేకపోయిన సేవ‌ చేస్తూనే ఉంటామ‌ని మంత్రి అఖిల‌ప్రియ సోద‌రి మౌనికా రెడ్డి తెలిపారు. త‌మ తండ్రి త‌మ‌కు పునాది వేశారని, నాగిరెడ్డిగారి పేరు నిలిపేందుకు తాను సామాన్య కార్యకర్తగా పనిచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. వారసత్వ రాజకీయాలు తప్పు కాదని ఆమె అన్నారు. ఛాన్స్ ఒక్కసారే ద‌క్కుతుంద‌ని అది ప్రూవ్ చేసుకోకపోతే భవిష్యత్ ఉండదని మౌనికారెడ్డి విశ్లేషించారు. తామేంటో నిరూపించుకున్నారు కాబట్టే భూమా వారసత్వం నిలబడిందని తెలిపారు. త‌మ‌ డ్రెసింగ్ పై కామెంట్ చేస్తున్నారు అంటే వారి విజ్ఞత ఏపాటిదో అర్థం చేసుకోవాలని మౌనికారెడ్డి వ్యాఖ్యానించారు.