Begin typing your search above and press return to search.

భూమా వర్సెస్ శిల్పా..శిల్పా రివెంజ్ తీర్చుకున్నట్టే

By:  Tupaki Desk   |   26 May 2019 5:11 PM GMT
భూమా వర్సెస్ శిల్పా..శిల్పా రివెంజ్ తీర్చుకున్నట్టే
X
నంద్యాల... భూమా - శిల్పా ఫ్యామిలీల వర్గ పోరుకు కేంద్రంగా నిలిచిన అసెంబ్లీ నియోజకవర్గం. ఒకరు ఒక పార్టీలో ఉంటే.. - మరొకరు ఇంకో పార్టీలో ఉంటారు. పార్టీల కంటే కూడా వర్గ పోరుకే ప్రాధాన్యమిచ్చిన కుటుంబాలుగా భూమా - శిల్పా ఫ్యామిలీలు నిలిచాయి. ఒకసారి ఒకరు గెలిస్తే... మరోసారి మరొకరు నిలిచి గెలుస్తున్నారు. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా... ఓ పదేళ్లుగా ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితి మారిందని చెప్పక తప్పదు. 2014 ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి పై వైసీపీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి విజయం సాధించిన తర్వాత ఈ వర్గ పోరు మరింతగా పెరిగిపోయింది.

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో భూమా వైసీపీకి హ్యాండిచ్చేసి టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత గుండెపోటు కారణంగా భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందారు. అప్పుడు శిల్పాతో పాటు భూమా కూడా టీడీపీలోనే ఉన్నారు. భూమా మరణంతో జరిగిన నంద్యాల బైపోల్స్ లో శిల్పాకు టీడీపీ అధిష్ఠానం హ్యాండివ్వగా... శిల్పా వెంటనే వైసీపీలో చేరిపోయి టికెట్ సంపాదించారు. అయితే అనూహ్యంగా భూమా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగిరెడ్డి సోదరుడు శేఖర్ రెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆ ఉప ఎన్నికలో శిల్పాను బ్రహ్మానందరెడ్డి 28 వేల భారీ మెజారిటీతో ఓడించేశారు. దీంతో షాక్ తిన్న శిల్పా మోహన్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం జరిగారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డికే టీడీపీ టికెట్ దక్కగా... తాను కాకుండా తన కుమారుడు శిల్పా రవిచంద్రా రెడ్డిని బరిలోకి దింపిన శిల్పా మోహన్ రెడ్డి... భూమా ఫ్యామిలీపై రివెంజ్ తీర్చేకున్నారు. తనను 28 వేల ఓట్ల మెజారిటీతో ఓడించిన బ్రహ్మానందరెడ్డిని తన కుమారుడి చేతిలో అంతకు మించి అన్నట్లుగా 33,423 ఓట్ల మెజారిటీతో ఓడించేశారు. మొత్తంగా తనకు జరిగిన పరాభవానికి శిల్పా మోహన్ రెడ్డి గట్టిగానే రివెంజ్ తీసుకున్నారన్న మాట. ఇదిలా ఉంటే... వైసీపీ వైపు వీచిన సునామీలో నంద్యాలలో బ్రహ్మానందరెడ్డితో పాటు ఆళ్లగడ్డలో ఆయన సోదరి - భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ కూడా ఓటమి పాలయ్యారు. మొత్తంగా ఇప్పుడు భూమా ఫ్యామిలీకి అసలు ఏ ఒక్క చోట కూడా ప్రాతినిధ్యం లేకుండా చేయడంలో శిల్పా ఫ్యామిలీ సక్సెస్ అయ్యిందన్న మాట.