Begin typing your search above and press return to search.

బాబు ఫోటోతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తాడట!

By:  Tupaki Desk   |   16 March 2019 10:32 AM GMT
బాబు ఫోటోతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తాడట!
X
నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఒక చిత్రమైన ప్రకటన చేశాడు. తనకు టికెట్ ఖరారు కాకపోవడంపై ఒకింత అసహనంతోనే మాట్లాడిన ఈయన… టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో నంద్యాల ఎమ్మెల్యే సీటుపై ప్రకటన లేదు. భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఖరారు చేస్తూ చంద్రబాబు నాయుడు ఇంకా నిర్ణయం ఏమీ తీసుకోలేదు. పెండింగ్ లో ఉన్న ఈ సీటు గురించి రెండో జాబితాలో ప్రకటన రావొచ్చని అంటున్నారు.

అయితే నంద్యాల ఎమ్మెల్యే సీటు విషయంలో పోటీ గట్టిగా ఉంది. బ్రహ్మానందరెడ్డికి ఉప ఎన్నికల్లో ఛాన్స్ ఇచ్చినప్పుడే ఒక్కసారే.. అని చెప్పారని ఇది వరకే వార్తలు వచ్చాయి. నంద్యాల నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తాడని కొంతకాలం ప్రచారం జరిగింది, కాదు లోకేష్ అనీ ప్రచారం జరిగింది. అదేమీ జరగలేదు కానీ.. ఇప్పుడు నంద్యాల ఎమ్మెల్యే టికెట్ విషయంలో పోటీ అయితే ఉంది.

ఎస్పీవై రెడ్డి కుటుంబం నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తోంది. నంద్యాల ఎంపీ టికెట్ విషయంలో చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో…ఎస్పీవై రెడ్డి తన కూతురుకు నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. మరోవైపు తనకు ఆళ్లగడ్డ - నంద్యాల ఏదో ఒక సీటును కేటాయించాలని ఏవీసుబ్బారెడ్డి బాబు వెంట పడుతూ ఉన్నారు. తనకు ఏదో ఒక సీటు ఖాయమని ఆయన చెప్పుకొంటూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు ఏ ప్రకటనా చేయలేదు. దీంతోభూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ దక్కుతుందా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిణామాల మధ్యన బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ..తనకు టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమని చెప్పారు. తన బాబాయ్ భూమా నాగిరెడ్డి ఫొటోతో - చంద్రబాబు ఫొటోతో ఇండిపెండెండ్ గా పోటీ చేయబోతున్నట్టుగా బ్రహ్మానందరెడ్డి ప్రకటించాడు. తనకు టికెట్ దక్కకపోతే జరిగేది అదే అన్నాడు!