Begin typing your search above and press return to search.

భూమా కుటుంబం.. ఏకతాటి పై ఉండబోదా?

By:  Tupaki Desk   |   17 Jun 2019 7:32 AM GMT
భూమా కుటుంబం.. ఏకతాటి పై ఉండబోదా?
X
తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడం చాలా రాజకీయ కుటుంబాలను ఇబ్బంది పెడుతూ ఉంది. ఇప్పటికే పలు పార్టీలు మారిన రాజకీయ కుటుంబాలు ఇప్పుడు ఎటు వెళ్లాలో - ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటి వాటిల్లో భూమా కుటుంబం కూడా ఒకటి.

నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయంలో దశాబ్దాలుగా వీరు కొనసాగుతూ వచ్చారు. అలాంటి సమయాల్లో కొన్ని సార్లు వీళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఓడినా ఏదో రకంగా తమ ఉనికిని అయితే కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో భూమా కుటుంబం పార్టీలు కూడా మారింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం, ఆ తర్వాత భూమా నాగిరెడ్డి మరణించడం, ఆయన కూతురుకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించడం తెలిసిన సంగతే.

అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయే సరికి అఖిలప్రియ మళ్లీ పార్టీ మారనున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నంలో ఉన్నారని, ఇప్పటికే ఆమె వైఎస్ విజయమ్మ ద్వారా జగన్ కు విన్నపాలు పంపే ప్రయత్నంలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ దొరకకపోతే ఆమె బీజేపీలోకి చేరవచ్చనే మాట వినిపిస్తోంది.

ఆమె సంగతలా ఉంటే.. ఆమె సోదరుడు, ఆమె తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన భూమా బ్రహ్మానందరెడ్డి మాత్రం తను తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు లేవని అంటున్నారట! ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అఖిలప్రియ టీడీపీని వీడవచ్చేమో కానీ.. బ్రహ్మానందరెడ్డి మాత్రం తెలుగుదేశంలోనే ఉంటారట. ఓటమి ఎదురుకాగానే పారిపోయే టైపు తను కాదని బ్రహ్మానందరెడ్డి అంటున్నాడని సమాచారం. అయితే అఖిలప్రియ మాత్రం ఇంత ధీమాగా మాట్లాడకపోవడంతో భూమా కుటుంబం ఇక రాజకీయంగా వేర్వేరు దారుల్లో నడుస్తుందేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.