Begin typing your search above and press return to search.

నిన్న బాబు దగ్గర ‘‘భూమా’’ పంచాయితీ

By:  Tupaki Desk   |   13 March 2017 9:36 AM IST
నిన్న బాబు దగ్గర ‘‘భూమా’’ పంచాయితీ
X
బైపాస్ సర్జరీ జరిగినా..ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే నంద్యాల ఎమ్మెల్యే.. ఏపీ టీడీపీ సీనియర్ నేత భూమానాగిరెడ్డి ఆకస్మిక మరణం అవాక్కు అయ్యేలా చేస్తోంది. ఆయనకు గుండెనొప్పి రావటం.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించటంలో..అంతలోనే ఆయన శ్వాస ఆగిపోవటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్ననే (శనివారం) విజయవాడకు వచ్చిన భూమా.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే భూమా ఆఖరి పంచాయితీ పార్టీ అధినేత చంద్రబాబుతోనే అని చెబుతున్నారు. తన వర్గానికి చెందిన పలువురిని తీసుకొచ్చిన ఆయన.. శిల్పా సోదరుల కారణంగా ఎన్ని ఇబ్బందులకు గురి అయ్యారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు.

తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ డిసైడ్ చేసిన అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డికి.. భూమాకు మొదటి నుంచి పొసగదు. ఆయన గెలుపునకు పూర్తి స్థాయిలో సహకరించాలని అధినేత చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో.. బాబుతో భేటీ అయ్యారు. తన మీద ఫిర్యాదు చేసిన శిల్పా బద్రర్స్ వాదనను తిప్పి కొట్టటంతోపాటు.. తన వర్గీయులు శిల్పా బ్రదర్స్ కారణంగా ఎన్నిఇబ్బందులు గురి అయ్యారో బాబుకు చెప్పుకునేలా చేశారు.

ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. తాను శిల్పా విజయం కోసం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తానని.. పార్టీ ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటిస్తానని మాట ఇచ్చిన విషయాన్ని భూమానే మీడియాతో చెప్పారు. తన ఆరోగ్యం బాగోటం లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ఆళ్లగడ్డలోనే ఉండి.. ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లనున్నట్లుగా మీడియాతో చెప్పారు.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మీడియాతో ముక్తసరిగా మాట్లాడే భూమా.. తన తీరుకు భిన్నంగా చాలాసేపు మాట్లాడటమే కాదు.. చాలా అంశాలపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. శనివారం తమతో చాలాసేపు గడిపి.. ఎన్నో విషయాలు మాట్లాడిన నేత.. తర్వాతిరోజునే విగతజీవిగా మారటాన్ని మీడియా ప్రతినిధులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/