Begin typing your search above and press return to search.

శోభమ్మ పక్కనే భూమా శాశ్వత విశ్రాంతి

By:  Tupaki Desk   |   13 March 2017 8:07 AM GMT
శోభమ్మ పక్కనే భూమా శాశ్వత విశ్రాంతి
X
భూమా నాగిరెడ్డి జీవితాన్నిదగ్గరగా చూస్తే.. ఒక తెలుగు సినిమా చూసినట్లుగా ఉంటుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇంటికి దూరంగా చదువు.. తండ్రి హత్యతో ఊరికి వెళ్లటం.. రాజకీయాల్లోకి వచ్చేయటం.. వర్గాన్నికాపాడుకునేందుకు ఫ్యాక్షన్ పడగనీడలో ప్రయాణించటం.. మధ్యలో మరదలి మీద మనసు పడటం.. మేనమామ నో చెప్పటం.. చివరకు రహస్యంగా పెళ్లి చేసుకొని..తర్వాత అందరిని ఒప్పించటం.. రాజకీయ నేతగా జిల్లాలో తిరుగులేని శక్తిగా మారటం.. ఇలా చెప్పుకుంటూ పోతే భూమా జీవితమంతా సినిమాటిక్ గా కనిపిస్తుంది.

ఫ్యాక్షన్ లో ప్రత్యర్థులపై పైచేయి సాధించటం.. అదే సమయంలో అదే ఫ్యాక్షన్ కు వ్యతిరేకంగా శాంతి పాదయాత్రలు చేసి.. రక్తపాతానికి చెక్ పెట్టిన వైనం.. ప్రత్యర్థులు సైతం ఆయన్ను అభిమానించేలా చేసిందని చెప్పాలి. రాజకీయాల్లో ఎగుడుదిగుళ్లలో పయనిస్తున్న వేళ.. ఊహించనిరీతిలో రోడ్డు ప్రమాదంలో భార్య మరణం.. రాజకీయంగా కొత్త ఒత్తిళ్లతో సాగుతున్న భూమా గుండె ఈ ఒత్తిడిని తట్టుకోలేకోయినట్లుంది. 53 ఏళ్లుగా నిర్విరామంగా కొట్టుకున్న గుండె మధ్యలో చిన్నపాటి అస్వస్థతకు గురైనా.. ఆదివారం ఉదయం మాత్రం అందరిని శోకసంద్రంలోకి నెట్టేస్తూ.. తన పనిని నిలిపివేసింది. అంతే.. భూమా కుటుంబాన్ని అమితంగా అభిమానించి.. ఆరాధించే వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. భూమా గురించి.. వారి కుటుంబం గురించి తెలిసిన వారికి నాగిరెడ్డి మరణం నోట మాట రాకుండా ఉండిపోయేలా చేసింది.

భూమా మరణం నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. వారి మాటల్లో భూమా నాగిరెడ్డి..శోభానాగిరెడ్డిల మధ్యనున్న అనుబంధాన్ని పలువురు ప్రస్తావించుకుంటున్నారు. మూడేళ్ల వ్యవధిలో భూమా దంపతులు ఊహించని రీతిలో మరణించిన వైనాన్ని తలుచుకొని కంటతడి పెడుతున్నారు. ఈ రోజు (సోమవారం) సాయంత్రం జరిపే నాగిరెడ్డి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శోభానాగిరెడ్డికి అంత్యక్రియలు నిర్వహించిన చోటనే నాగిరెడ్డి అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. శోభా ఘాట్ లో ఆయనకు అంత్యక్రియలు ఏపీప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంతకాలం శోభా ఘాట్ గా వ్యవహరించిన ప్రాంతాన్ని ఇకపై భూమా ఘాట్ గా వ్యవహరించనున్నారు. ఘాట్ చుట్టూ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భూమా అంత్యక్రియలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. పలువురు మంత్రులు.. అధికారపక్ష నేతలు భారీగా హాజరు కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు అంత్యక్రియల్ని చేయాలని నిర్ణయించారు.

భూమానాగిరెడ్డి మరణానికి ముందు రోజు జరిగిన విషయాల్ని పలువురు టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. తన వర్గానికి చెందిన పలువురిని తీసుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన భూమా..శిల్పా కుటుంబం కారణంగా తన వర్గం ఎన్ని ఇబ్బందులు పడ్డారన్న విషయన్ని..వారి చేతనే చెప్పించారు. ఈ సందర్భంగా తన వెంట వచ్చిన వారిని పేరుపేరునా ముఖ్యమంత్రికి పరిచయం చేసిన భూమా..కార్యక్రమం మొత్తం ఉల్లాసంగా కనిపించారు. తన వెంటవచ్చిన వారందరితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇదే.. ఆయన ఆఖరి ఫోటో అయ్యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/