Begin typing your search above and press return to search.

నంద్యాల చుట్టాల దారెటు?

By:  Tupaki Desk   |   30 Jun 2017 7:21 AM GMT
నంద్యాల చుట్టాల దారెటు?
X
నంద్యాల ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబు మూడేళ్ల పాలన పూర్తిచేసుకున్న తరువాత వస్తున్న తొలి ఉప ఎన్నిక కావడంతో దీన్ని పాలక పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే... అదే సమయంలో విపక్షం కూడా దీన్ని ఎలాగైనా గెలవాలనుకుంటోంది. ఇప్పటికే రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. టీడీపీ తరపున భూమా కుటుంబం నుండి భూమా బ్రహ్మానందరెడ్డి బరిలో నిలవగా, టీడీపీలో టికెట్‌ ఆశించి భంగపాటుకు గురై ఇటీవల వైసీపీలో చేరిన శిల్పా మోహన్‌ రెడ్డి వైకాపా నుండి ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు.

పర్యాటక శాఖ మంత్రి, నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ ఉప ఎన్నికలలో తప్పక గెలుస్తామని, గెలవకపోతే రాజకీయాల నుండి తప్పు కుంటామని ప్రకటించడం... శిల్పా మోహన్‌ రెడ్డి కూడా ఈ సవాల్‌ ను స్వీకరించడంతో నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

పార్టీల పరంగా ఇదంతా ఎలా ఉన్నా స్థానిక నేతలను మాత్రం ఈ ఎన్నికలు ఇరకాటంలో పెడుతున్నాయి. అభ్యర్థుల సమీప బంధువులు ప్రత్యర్థి పార్టీల్లో ఉండడంతో వారు ఎలా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారింది.

వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి తమ్ముడు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.... నిన్నమొన్నటి వరకు టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనే ఉన్నారు.

అలాగే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మామ కాటసాని రామిరెడ్డి వైసీపీలో ఉన్నారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన వైసీపీలో కీలకంగా ఉన్నారు.

టీడీపీలో ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ అభ్యర్థి అయిన తన అన్న శిల్పా మోహన్‌రెడ్డి మాటకు వ్యతిరేకంగా ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసే సూచనలు ఏమీ కనిపించడం లేదు. అందులో భాగంగానే శిల్పా చక్రపాణిరెడ్డిని టీడీపీ నంద్యాల ఉప ఎన్నికకు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. నెలరోజుల క్రితం వరకు టిడిపి జిల్లా అధ్యక్షులుగా, ఎంఎల్‌సిగా జిల్లా రాజకీయాలను శాసించిన శిల్పా చక్రపాణిరెడ్డి తన అన్న వైసీపీలో చేరడంతో ప్రస్తుతానికి మౌనవ్రతం దాల్చారు. శ్రీశైలం నియోజకవర్గంలో ప్రస్తుతానికి రాజకీయంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ శిల్పా చక్రపాణిరెడ్డి ఎక్కువరోజులు అన్నకు వ్యతిరేకంగా అధికార తెలుగుదేశం పార్టీలో ఇమడలేరన్న వాదన ఉంది.

మరోవైపు టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోకవర్గ వైకాపా ఇంచార్జీ అయిన కాటసాని రామిరెడ్డి మామ అల్లుల్లు కావడంతో బ్రహ్మానందరెడ్డి విజయానికి కాటసాని రామిరెడ్డి సహకరిస్తారా లేదా అన్నది చూడాలి. బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు జగన్‌ వద్ద ఆయన రాయబారం నెరిపారని కూడా టాక్.

ఈ నేపథ్యంలో రెండు పార్టీల్లోకి కీలక నేతలు బంధుత్వానికి ప్రాధాన్యమిస్తారా లేదంటే పార్టీకి కట్టుబడి ఉంటారా అన్నది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/