Begin typing your search above and press return to search.

టీడీపీ జ‌మానా తీర్పు...వేట‌గాడే బాధితుడ‌ట‌!

By:  Tupaki Desk   |   24 Aug 2017 12:45 PM GMT
టీడీపీ జ‌మానా తీర్పు...వేట‌గాడే బాధితుడ‌ట‌!
X
ప‌ట్ట ప‌గ‌లు... న‌ట్ట న‌డిరోడ్డు...వాహ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. పోతూనే ఉన్నాయి. అప్ప‌టిదాకా ఓ పెద్ద నిర్మాణం వ‌ద్ద మందీ మార్బ‌లాన్ని వెంటేసుకుని ప్ర‌త్య‌ర్థి కోసం కాసుకుని కూర్చున్న‌ట్లుగా తెల్ల రంగు చొక్కా - అదే రంగు ప్యాంటు వేసుకుని నిల‌బ‌డ్డ ఓ వ్య‌క్తి... చేతిలో క‌త్తి... అది కూడా వేట కొడ‌వ‌లి లాంటి క‌త్తి క‌నిపిస్తోంది. కంటికి ల‌క్ష్యం క‌నిపించ‌గానే లంఘించాడు. అప్ప‌టికే చేతిలో ఉన్న వేట క‌త్తి చాల‌ద‌నుకున్నాడో - ఏమో తెలియ‌దు గానీ... కింద‌కు వంగి ఓ రాయిని ఇంకో చేతిలోకి తీసుకున్నాడు. అంతే... త‌న అల్లంత దూరంలో ఉన్న త‌న ప్ర‌త్య‌ర్థి కారుపైకి విసిరాడు. త‌న‌ ప్రాణ ర‌క్ష‌ణ కోస‌మంటూ నియ‌మించుకున్న ప్రైవేటు గ‌న్ మ‌న్ కూడా అత‌డిలాగే పేట్రేగిపోయాడు. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గానికి చెందిన కీల‌క నేత‌కు తుపాకీ గురి పెట్టి... అంత‌లోనే ఏమ‌నుకున్నాడో, ఏమో గానీ... గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జ‌రిపాడు. ఆ వెంట‌నే అనుచ‌రుల‌తో ప్ర‌త్య‌ర్థి వ‌ర్గంతో యుద్ధానికి ఆ వ్య‌క్తి - అత‌డి అంగ‌ర‌క్ష‌కుడు ఉరికారు. వీరి వీరంగం చూసి అప్ప‌టిదాదా అక్క‌డే ఉన్నపోలీసులు ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు పెట్టారు.

కాపాడాల్సిన పోలీసులే ప్రాణాల‌ర‌చేత ప‌ట్టుకుని పారిపోతే... ఇక వారి దాడి నుంచి కాపాడేది ఇంకెవ‌రు? అన్న భావ‌న‌తో ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం కూడా భ‌యప‌డిపోయింద‌నే చెప్పాలి. అయితే ప్రాణ‌మున్నంత దాకానైనా పోరాడాలి క‌దా అన్న రీతిలో ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం కూడా ఆ వ్యక్తి - అత‌డి ప‌రివారానికి ఎదురు తిరిగింది. ఇరు వ‌ర్గాలు క‌ల‌బ‌డుతున్నాయి. అయితే ఈలోగానే స‌మాచారం అందుకున్న పోలీసులు కాస్త ఆల‌స్యంగానైనా అక్క‌డికి చేరుకున్నాడు. ఇరు వ‌ర్గాల‌ను విడ‌దీశారు. పోలీసుల స‌మ‌క్షంలోనూ ఆ వ్య‌క్తి వీరంగం వీడ‌లేదు. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం వైపు వేట క‌త్తి ఉన్న చేతిని చూపుతూ చంపేస్తానంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. ఇదీ... నేటి ఉద‌యం నంద్యాల ప‌ట్ట‌ణంలోని సూర‌జ్ గ్రాండ్ హోట‌ల్ స‌మీపంలో చోటుచేసుకున్న ఘ‌ట‌న‌.

ఈ ఘ‌ట‌న‌లో క‌త్తి ప‌ట్టుకుని వీరంగ‌మాడిన ఆ వ్య‌క్తి టీడీపీ దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి వ‌ర్గానికి చెందిన అభిరుచి మ‌ధు. పోలీసు రికార్డుల్లో రౌడీ షీట‌ర్‌గా ఖ్యాతిగాంచిన ఇత‌డికి ఇంకొక‌ళ్ల ప్ర‌భుత్వంలో అయితే సెక్యూరిటీ దొర‌క‌దు గానీ... ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వం ప్రైవేటు గ‌న్‌ మ‌న్‌ ను నియ‌మించుకునేందుకు అత‌డికి అవ‌కాశ‌మిచ్చింది. ఆ గ‌న్ మ‌న్ కూడా స‌ద‌రు రౌడీషీట‌ర్ త‌ర‌హాలోనే రెచ్చిపోయాడు. నిబంధ‌న‌ల‌కు నీళ్లొదిలేసి.. గాల్లోకి కాల్పులు జ‌రిపాడు. వీరిద్ద‌రూ త‌మ అనుచ‌ర వ‌ర్గంతో దాడికి తెగ‌బ‌డింది సాధార‌ణ వ్య‌క్తిపై కాదు. మొన్న‌టిదాకా టీడీపీ జిల్లా అధ్య‌క్షుడిగా - ఏపీ శాస‌న‌మండ‌లి స‌భ్యుడి(ఎమ్మెల్సీ)గా ఉన్న సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిపై.

నేటి ఉద‌యం పెను క‌ల‌క‌లం రేపిన ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ఘ‌ట‌న‌ను ప‌రిశీలించిన వారివ‌రికైనా... వేట‌క‌త్తి చేత‌బ‌ట్టి న‌డిరోడ్డుపై వీరంగం ఆడ‌టంతో పాటు పోలీసుల స‌మ‌క్షంలోనే చంపేస్తానంటూ ప్ర‌త్య‌ర్థి వ‌ర్గంపై క‌త్తి చూపెడుతూ వెళ్లిన మ‌ధునే నిందితుడు. అస‌లు చ‌క్ర‌పాణిరెడ్డి కారును అడ్డగించిన మ‌ధునే గొడ‌వ‌కు కార‌ణ‌మ‌ని కూడా అన్ని వ‌ర్గాలు వాదిస్తున్నాయి. ఈ క్ర‌మంలో శిల్పా ఫిర్యాదుతో మ‌ధుపై కేసు న‌మోదు చేయాలి. మ‌రి ఈ ఘ‌ట‌న‌లో చంద్ర‌బాబు స‌ర్కారు కింద ప‌నిచేస్తున్న పోలీసులు ఎవ‌రిపై కేసులు పెట్టారో తెలుసా? ఓ రౌడీ షీట‌ర్ వీరంగంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిపై. ఇదెక్క‌డి న్యాయ‌మంటే... ప‌ట్ట‌ప‌గ‌లు, న‌డిరోడ్డుపై వేట క‌త్తితో వీరంగ‌మాడిన మ‌ధు... శిల్పాపైనే ఫిర్యాదు చేశాడ‌ట‌. అత‌డిచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిపై కేసు న‌మోదు చేశారు.

ఈ కేసులో ఏఏ అంశాల‌ను ప్ర‌స్తావించార‌న్న అంశానికి వ‌స్తే.. అస‌లు శిల్పా చక్ర‌పాణిరెడ్డే ముందుగా మ‌ధుపై హ‌త్యాయ‌త్నం చేశార‌ట‌. ఈ క్రమంలో ప్రాణ ర‌క్ష‌ణ నిమిత్త‌మే మ‌ధు క‌త్తి చేత‌బ‌డితే... ఆయ‌న గ‌న్‌మ‌న్ ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జ‌రిపాడ‌ట‌. ఇదంతా బాగానే ఉన్నా... ప్ర‌స్తుతం నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక నేప‌థ్యంలో అక్క‌డ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది క‌దా. మ‌రి ఓ వ్య‌క్తికి చెందిన ప్రైవేటు గ‌న్‌ మ‌న్ చేతిలోకి తుపాకీ ఎలా వ‌చ్చిందన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది. ఏ ఒక్క‌దానికీ స్ప‌ష్ట‌మైన స‌మాధానం లేని ఈ ఘ‌ట‌న‌లో నిజంగా నంద్యాల పోలీసులు న‌మోదు చేసిన కేసులు ఎన్ని మ‌లుపులు తిరుగుతాయో చూడాలి.