Begin typing your search above and press return to search.

ఇంటరెస్టింగ్ : పవన్ కి అక్కడ యంగ్ టర్క్ తో పోటీ..?

By:  Tupaki Desk   |   12 Jun 2022 5:38 AM GMT
ఇంటరెస్టింగ్ : పవన్ కి అక్కడ యంగ్ టర్క్ తో పోటీ..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. ఆయన ఫ్యాన్స్ అయినా జనసైనికులు అయినా టోటల్ యూత్. దాంతో పవన్ జనసేనను యువసేన అని కూడా పిలుస్తారు. ఇక పవన్ ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టాల్సిందే అని వారు శపధం పట్టేశారు. ఆయన పోటీ చేయడానికి ఎన్నో సీట్లు ఉన్నాయి. కానీ ఆయన ఎక్కువ మక్కువ చూపించేది మాత్రం తిరుపతి మీదనే.

దానికి చాలా కారణాలు ఉన్నాయి. అన్న చిరంజీవి 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సీటు ఇది. దాంతో అన్న గారి అనుంగు తమ్ముడిగా పవన్ తిరుపతి ప్రసాదం తనదే అంటున్నారు. ఇక అక్కడ పవన్ సామాజికవర్గం చాలా ఎక్కువగా ఉంది. లెక్కలు తీస్తే ఆ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ మంది ఇటీవల కాలంలో గెలిచిన దాఖలాలు ఉన్నాయి.

ఇక తిరుపతి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. అంతే కాదు, జనసేనకు అక్కడ కరడు కట్టిన అనుచరులు ఉన్నారు. దాంతో పవన్ కనుక పోటీకి దిగితే విజయం నల్లేరు మీద నడక అని అంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్ధి ఎవరు అన్న చర్చ వస్తోంది. కానీ చిత్రంగా ఒక పేరు వినిపిస్తోంది. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

నిజానికి అభినయ్ ఇప్పటికే యువ నేతగా వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఆయన తిరుపతి కార్పోరేషన్ నుంచి కార్పోరేటర్ గా గెలిచారు. తండ్రి భూమన నుంచి ఆయన రాజకీయ ఓనమాలు దిద్దారు. ఇక తండ్రి భూమన గెలుపు వెనక కూడా అభినయ్ ది కీలకపాత్ర. ముఖ్యంగా ఆయన తిరుపతిలో గట్టి పట్టు సాధించారు. అన్ని సామాజిక వర్గాలలో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన అంటే ప్రేమించే వర్గాలు ఉన్నాయి.

ఇక ఏ సమస్య వచ్చినా అభినయ్ వెంటనే రంగంలోకి దిగిపోయి జనాలకు అందుబాటులో ఉన్న నేతగా నిలిచారు. పక్కా లోకల్ అన్న కార్డు తో ఆయన పవన్ మీద పోటీకి దూసుకువస్తున్నారు. నిజానికి పవన్ తో అభినయ్ పోటీ అంటే చాలా మంది జనసేనాని విజయం సులువు అనే అంటారు. అదే జరగాలి కూడా

కానీ ఇక్కడ అభినయ్ కి ఉన్న విస్తృతమైన పరిచయాలు, ఆయన సాధించి పెట్టుకున్న సొంత చరిష్మా ఇవన్నీ కలసి చాలా ఇంటరెస్టింగ్ ఫైట్ ని అయితే తిరుపతిలో జరిగేలా చేస్తాయని అంటున్నారు. ఇక ఎపుడు ఎన్నికలు జరిగినా తాను రెడీ అంటూ ప్రతీ రోజూ తిరుపతిలో అంతా చుట్టబెట్టే అభినయ్ వైసీపీకి ట్రంప్ కార్డ్. మరి పవన్ పొత్తులతో వస్తే కధ ఒకలా ఉంటుంది. విడిగా పోటీ చేసినా కధ మరోలా ఉంటుంది. వైసీపీ మాత్రం ఈ యంగ్ టర్క్ ని గట్టిగా నమ్ముకుంటోంది. పవన్ తిరుపతి అంటే మాత్రం నరాలు తెగే విధంగా ఈ పోరు ఉత్కంఠను రేపడం ఖాయం అంటున్నారు.