Begin typing your search above and press return to search.

ప్ర‌జాస్వామ్యం పేరు మార్చేసిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   23 Jun 2017 4:44 PM GMT
ప్ర‌జాస్వామ్యం పేరు మార్చేసిన చంద్ర‌బాబు
X
ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిప‌డ్డారు. త‌న ప‌థ‌కాల ద్వార ల‌బ్ధిపొందుతూ త‌న‌కు ఓట్లు వేయ‌క‌పోవ‌డం ఏమిట‌ని బాబు ప్ర‌శ్నించ‌డం, హెచ్చ‌రిక‌లు జారీచేయ‌డం చూస్తుంటే ఆయ‌న‌లో అస‌హ‌నం ఏ స్థాయికి చేరింది అర్థ‌మ‌వుతోంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వం సొమ్ముల‌ నుంచి చేస్తున్న కార్యక్రమాలకు మీ అబ్బసొత్తు నుంచి ధారాదత్తం చేస్తున్నారా అని భూమ‌న సూటిగా ప్ర‌శ్నించారు. తరతరాలుగా పేరుకుపోయిన ఆస్తులను వీధి దీపాలు, రహదారులు, పెన్షన్లుగా మార్చి చారిటీ ద్వారా పంపకాలు చేస్తున్నారా అని నిల‌దీశారు. ప్ర‌జలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలందరినీ దోపిడీ చేసి దొంగలు, వీధి రౌడీలు, గుండాలకంటే హీనంగా బాబు పరిపాలన సాగిస్తున్నాడని భూమన ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

విశాఖ నుంచి అమరావతి, కర్నూలు వరకు భూ దందాలు, ప్రజా విద్రోహ కార్యక్రమాలతో రూ. లక్షల కోట్లు దోపిడీ చేసి ఆ ధనంతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని భూమ‌న ఆరోపించారు. అలా సంపాదించిన సొమ్ముల‌తోనే ఓట్లు కొనేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. గ‌తంలో తెలంగాణలో ఎమ్మెల్యేను కొనడానికి రూ. 5 కోట్లు ప్రయత్నించారని, రూ. 5 వేలతో ఓటర్లను కొనుగోలు చేయడానికి చూస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేలు కూడా ఇవ్వగలను అని చంద్రబాబు మాట్లాడిన మాటలకు జైలుకు పంపాల్సిన అవసరం ఉందని భూమ‌న అన్నారు. రూ. 5 కోట్లతో ఎమ్మెల్సీని గెలిపించడానికి ఎమ్మెల్యేను కొనుగోలు చేశారనడానికి ఇంతకంటే ఊదాహర‌ణ అవ‌స‌రం లేద‌ని భూమ‌న తెలిపారు.

టీడీపీ సర్కార్‌ ప్రజాస్వామ్య రాజకీయం అంతా అవినీతితో నిండిందని భూమ‌న మండిప‌డ్డారు. ప్రజాస్వామ్యానికి పేరు మార్చేసి చంద్రస్వామ్యం అని తీసుకొచ్చారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓట్లను కొనుగోలు చేయడం.. ప్రజలందరినీ ఓటర్లుగా చూడడం..డ‌బ్బులు వెద‌జ‌ల్ల‌డం చంద్ర‌స్వామ్యం తీరు అని భూమ‌న వ్యాఖ్యానించారు. దివంగ‌త సీఎం వైఎస్‌ఆర్‌ ప్రజలకు మేలు చేసిన కార్యక్రమాల్లో కనీసం 5 శాతం కూడా నెరవేర్చకపోవడం మూలంగా చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంద‌ని, ఇది గ‌మ‌నించే అస‌హ‌న వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని భూమ‌న చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/