Begin typing your search above and press return to search.

తిరుపతి నుంచే కోడెల ఫ్యామిలీకి నెలకు నలభై లక్షలా!

By:  Tupaki Desk   |   9 Sep 2019 2:30 PM GMT
తిరుపతి నుంచే కోడెల ఫ్యామిలీకి నెలకు నలభై లక్షలా!
X
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అక్కడి పరిస్థితులపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రుయా ఆసుపత్రిలో కోడెల కుటుంబీకుల బినామీల దోపిడీ ఇప్పటికీ కొనసాగుతూ ఉండటంపై కరుణాకర్ రెడ్డి అక్కడి అధికారులపై మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో రుయాలో తిష్టవేసిన కోడెల బినామీలు ఇప్పటికీ దందాలు కొనసాగిస్తున్న వైనంపై భూమన అధికారులతో మాట్లాడారు. కోడెల బినామీలను తక్షణం ఆసుపత్రి నుంచి సాగనంపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని భూమన హెచ్చరించారు.

ల్యాబ్ లు, మెడికల్స్ విషయంలో కోడెల కుటుంబం దందా రుయాలో కూడా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం రుయా మాత్రమే కాదు..రాయలసీమ వ్యాప్తంగా కోడెల కుటుంబం దందాలు కొనసాగుతూ వచ్చాయని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. వారు చెప్పిన మందులను మాత్రమే అమ్మడంతో పాటు, వేరే బ్రాండ్లకు తమ ఇళ్లలో ప్యాకింగ్ చేసి పై లాభానికి ఆసుపత్రులకు పంపించారే అభియోగాలు కూడా కోడెల కుటుంబం పై ఉన్నాయి.

ఆసుపత్రిలో వాడే దూదిని కూడా కోడెల కుటుంబం మార్కెట్ చేసిందని, ఒక ఫేక్ బ్రాండ్ ను క్రియేట్ చేసి తమిళనాడు నుంచి దూదిని తెప్పిస్తూ.. తాము ప్యాకేజ్ చేయించి ప్రభుత్వాసుపత్రులకు సోలో డీలర్ షిప్ ను కోడెల కుటుంబం సొంతం చేసుకుందనే ఆరోపణలున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులూ అలాంటి దందా సాగిందనే ఆరోపణలున్నాయి.

టీడీపీ అధికారం కోల్పోయి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వాసుపత్రుల్లో కోడెల కుటుంబం దందాలు కొనసాగుతూ ఉన్నాయని భూమన అంటున్నారు. రుయా నుంచి వారిని సాగనంపాల్సిందే అని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. ఒక్క రుయా ఆసుపత్రి నుంచినే కోడెల బినామీలు నెలకు నలభై లక్షల రూపాయల వరకూ సంపాదించుకుంటూ ఉన్నారని భూమన పేర్కొన్నారు.