Begin typing your search above and press return to search.
ఆర్కే నగర్ కంటే నంద్యాలే అద్వాన్నమట!
By: Tupaki Desk | 1 Aug 2017 10:09 AM GMTతమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆకస్మిక మరణంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గానికి నిర్వహించాల్సిన ఉప ఎన్నిక ఉన్నపళంగా రద్దైపోయింది. ఎందుకంటే... తమిళ తంబీలంతా అమ్మగా పిలుచుకునే జయ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆమె నెచ్చెలి శశికళ - అమ్మ నమ్మిన బంటు పన్నీర్ సెల్వం - శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ లు ఎవరికి వారుగా ముమ్మర యత్నాలు చేశారు. డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. టీవీవీ దినకరన్ అయితే ఏకంగా కోట్లాది రూపాయల ధనాన్ని అక్కడ పంపిణీ చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి పక్కా ఆధారాలు దొరికిపోయాయి. దీంతో ఆ ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. ఇప్పుడు ఎన్నికల సంఘం నమోదు చేసిన కేసులతో ఇటు దినకరన్ తో పాటు అటు పన్నీర్ సెల్వం వర్గం కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోందనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు ఆ ఇబ్బందులు తప్పినా... భవిష్యత్తులో మాత్రం ఆ రెండు వర్గాలకు మాత్రం ఇది పెను ముప్పుగానే పరిణమించే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.
అయినా ఎప్పుడో రద్దైపోయిన ఆర్కే నగర్ బైపోల్స్ః సంగతి ఇప్పుడెందుకులే అంటారా? ఎక్కడో తమిళనాడులో జరిగిన ఈ విషయాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయానికి వస్తే... ప్రస్తుతం కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలు... ఆర్కే నగర్ ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలే పునరావృతమవుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి హఠాన్మరణం కారణంగా అనివార్యమైన నంద్యాల బైపోల్స్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉప ఎన్నికను చంద్రబాబు సర్కారు వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గానే భావిస్తోంది. అదే సమయంలో విపక్ష వైసీపీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగానే భావిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే ఈ రెండు పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. నోటిఫికేషన్ కంటే ముందుగానే రెండు పార్టీలు కూడా ప్రచారాన్ని ప్రారంభించేయాయనే చెప్పాలి. ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సదరు ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించి విపక్షం వైసీపీ మనో ధైర్యాన్ని దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో టీడీపీ వ్యూహాలు పన్నుతోందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికకు అధికార పార్టీ నిర్ణయించుకున్న భారీ ప్రణాళికే ఇందుకు నిదర్శనమన్న వాదన కూడా లేకపోలేదు.
ఈ క్రమంలో నేటి ఉదయం నంద్యాల వచ్చిన వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి... అధికార పార్టీ దమన నీతిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. * ఆరు కోట్లమంది ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి నంద్యాల ప్రజలకు కసి తీర్చుకునే అవకాశం వచ్చిందని భూమన అన్నారు. నంద్యాల ప్రజలు చంద్రబాబు పాలనకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తొలి కానుకగా నంద్యాలను ఇవ్వనున్నారని ఆయన పేర్కొన్నారు. నంద్యాల ప్రజలను మాయమాటలతో చంద్రబాబు సర్కార్ మభ్యపెడుతోందన్నారు. పాలన గాలికొదిలేసి మంత్రులంతా నంద్యాలలో మకాం వేశారని, ఓటమి బయంతో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. వైఎస్ ఆర్ సీపీ శ్రేణులు లక్ష్యంగా పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. తమిళనాడు ఆర్కేనగర్ కంటే నంద్యాల అధ్వానంగా మారుతోందని, ఏ టీడీపీవాళ్ల ఇంటికి వెతికినా డబ్బు దొరకుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు అభివృద్ధితో కాకుండా అవినీతి డబ్బుతో గెలుపు సాధించాలనుకుంటున్నారని భూమన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు తమ స్థాయిని మించి నంద్యాలలో వీధి రౌడీల్లా మారుతున్నారని, టీడీపీ అంటేనే తెగించి దౌర్జన్యాలకు పాల్పడే పార్టీ అని భూమన విమర్శించారు.