Begin typing your search above and press return to search.

వెంకయ్యకు కొత్త పదవిచ్చిన వైకాపా!

By:  Tupaki Desk   |   29 Sep 2016 4:39 AM GMT
వెంకయ్యకు కొత్త పదవిచ్చిన వైకాపా!
X
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇక బీజేపీ కి తిరుగులేదని, టీడీపీ కి కూడా ఇప్పట్లో ఏమీ అడ్డులేదని చాలామంది భావిస్తున్న తరుణంలో తెరపైకి వచ్చింది ప్రత్యేక హోదా. గత కొన్ని నెలలుగా ఈ విషయం ఏపీ రాజకీయాల్లో కొత్త అలజడులు సృష్టిస్తుంది. కొంతమంది నేతలైతే ఈ "ప్రత్యేక హోదా" అంశం వల్ల ఏపీలో మధ్యంతర ఎన్నికలొచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు అనేస్థాయిలో మాట్లాడుతున్నారంటే, ఈ అంశం ఏపీలో ఎంత హాట్ టాపిక్కో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఏపీ వ్యక్తిగా - కేంద్రమంత్రిగా వెంకయ్యపైనా - ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఎక్కువ భారం - బాధ్యత ఉండేది. అయితే వారుసైతం "హోదా వల్ల ప్రయోజనం ఏమిటి అని" ఎదురు ప్రశ్నిస్తున్న సమయంలో ఏపీ భగ్గుమంది.

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైకాపా నేతలు వెంకయ్యను - చంద్రబాబును ఏకిపారేస్తున్నారు. ప్రజలతో మీటింగులు పెడుతున్నారు - ప్రజాబ్యాలెట్లు నిర్వహిస్తున్నారు. మార్గం ఏదైనా, ఎంచుకున్న పద్దతేదైనా హోదా ప్రాముఖ్యతను అవసరాన్ని చెబుతూనే - మరోపక్క వెంకయ్య - చంద్రబాబులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి వీరిపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ కు ఆశాజ్యోతి వంటి ప్రత్యేక హోదాను సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు - వెంకయ్యలు తెలుగు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని అంటున్నారు. హోదా కోసం ప్రజలంతా ఒకపక్క పోరాడుతూ ఉంటే, మరోపక్క ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ వల్లే ఎక్కువ లాభాలని వీరిద్దరూ తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా వెంకయ్యపై సెటైర్స్ వేసిన భూమన... వాస్తవానికి వెంకయ్య బీజేపీలో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నా కూడా ఏపీకి వచ్చేసరికి టీడీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. వెంకయ్య - చంద్రబాబు ఇద్దరూ అవిభక్త కవలలని - శరీరాలు వేరైనా వారు చెప్పే మాటలు ఆడే అబద్ధాలు ఒక్కటేనని అన్నారు. అయితే... చంద్రబాబుపై సరే కానీ, ఇంతకాలం వెంకయ్యపై మాత్రం ఏపీ నుంచి విమర్శలేమీ పెద్దగా వచ్చేవి కాదు. అయితే ఈ ప్రత్యేక హోదా విషయంలో మాటతప్పడంతో ఆ పని కూడా జరిగిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/