Begin typing your search above and press return to search.

బాబులో మరీ తెల్లదొరల విలనీ ఉందా?

By:  Tupaki Desk   |   6 Sep 2016 2:20 PM GMT
బాబులో మరీ తెల్లదొరల విలనీ ఉందా?
X
మామూలు విలనీ వేరు.. స్వాతంత్రోద్యమ కాలంలో.. ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి అత్యంత కౄరంగా ప్రవర్తించిన తెల్లదొరల విలనీ వేరు! ఉద్యమకారుల్ని ఎంత కౄరంగా హింసించారో - బహిరంగ ప్రదేశాలలో తెల్లదొరలు ఎంత దారుణంగా చంపేవారో మనం పోరాటాల కథల్లో తెలుసుకుంటాం. అయితే ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును.. అలాంటి తెల్లదొరల్లోనే అత్యంత కరడు గట్టిన వాడిగా పేరున్న విలన్‌ తో పోల్చేశాడు భూమన కరుణాకరరెడ్డి. తుని దుర్ఘటనకు తాను ఒక బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ సీఐడీ విచారణకు గుంటూరులో హాజరైన భూమన - అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రూథర్‌ ఫర్డ్‌ లాంటి వారని తీవ్ర విమర్శలు చేశారు.

రూథర్‌ ఫర్డ్‌ అంటే ఉత్తరాంధ్రలోని విశాఖ మన్యంలో స్వాతంత్రోద్యమ కాలంలో పనిచేసిన బ్రిటిష్‌ జనరల్‌. అప్పట్లో ఆ ప్రాంతపు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కోసం వేటాడి వేటాడి అత్యంత పాశవికంగా మట్టుపెట్టింది రూథర్‌ ఫర్డే. గిరిజనులను అణగదొక్కడానికి ప్రయత్నించిన రూథర్‌ ఫర్డ్‌ లాగానే, కాపులను అణగదొక్కడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడంటూ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించడం విశేషం.

చంద్రబాబుకు కాపుల మీద ఉన్న ప్రేమను కపట ప్రేమగా భూమన అభివర్ణించారు. పాము- కప్ప బంధం లాంటిది.. కాపుల పై చంద్రబాబు ప్రేమ అన్నారు. పాము ఎప్పటికైనా కప్పను మింగాలనే చూస్తుందని ఆరోపించారు. జగన్‌ మీద బురద చల్లడానికి - తనను బద్నాం చేయడానికి అకారణమైన ఇలాంటి ఆరోపణలతో విచారణ చేస్తున్నారని భూమన ఎద్దేవా చేశారు. అయితే.. చంద్రబాబులో బ్రిటిష్‌ తెల్లదొరలంతటి కౄరత్వం - అలాంటి కుట్ర మనస్తత్వం ఉన్నాయా.. అని.. మరీ చరిత్రలోకి వెళ్లి కరుణాకరరెడ్డి రూథర్‌ ఫర్డ్‌ తో చంద్రబాబును పోల్చడం చిత్రంగా ఉందని జనం అనుకుంటున్నారు.