Begin typing your search above and press return to search.
తన కాళ్లు తానే మొక్కుకుంటున్న బాబు!
By: Tupaki Desk | 12 Jan 2017 5:54 PM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఏకకాలంలో ఇటు విమర్శలు అటు సెటైర్లను ఏకకాలంలో చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 90 శాతం పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్ట్ పనులకు చంద్రబాబు ప్రారంభోత్సవాలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ చంద్రబాబు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబుకు తన పనితనం మీద తనకే నమ్మకం లేదని అన్నారు. అందుకే ఏ సభకు వెళ్లినా ‘‘గట్టిగా చప్పట్లు కొట్టండి. నా కొరకు ప్రార్థనలు చేయండి... నన్ను గుర్తుంచుకోండి...నన్ను తలుచుకోండి’’ అంటూ ప్రజలతో ప్రమాణాలు చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘పొగడ్తలు అడుక్కునే బిచ్చగాడిలా చంద్రబాబు దిగజారిపోయారని మండిపడ్డారు. ఒక్క ప్రజా హిత కార్యక్రమం కూడా చేయడం లేదని, బాబు మాటల మీద, చేతల మీద ప్రజలకు విశ్వాసం, నమ్మకం, ప్రేమ, అభిమానం లేవన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం బాబు గప్పాలు కొంటుకుంటున్నారని నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ ఏ సభలోనూ చప్పట్లు కొట్టండని కోరలేదన్నారు. కానీ చంద్రబాబు నర్తనశాల సినిమాలో మహాభారతం, విరాటపర్వం సన్నివేశంలో ఉత్తరకుమారుడు కౌరవుల మీదకు దండెత్తి వచ్చినట్లు చంద్రబాబు కూడా ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి పోల్చి చెప్పారు. బాబు తీరు తన కాళ్లకు తానే మొక్కు కుంటున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబువి హత్యా రాజకీయాలని భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైయస్ రాజారెడ్డిని చంపించింది చంద్రబాబే అని ఆరోపించారు. వైఎస్‌ను గుండాగా, రౌడీగా, హంతకుడిగా చిత్రీకరించి ప్రజల్లో భయాందోళన కలిగించారని, అయితే జనం వీరి మాటలు వినకుండా వైఎస్ఆర్ను తమ గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారన్నారు. వైఎస్ఆర్పై అబద్ధాలు చెప్పినట్లుగానే నేడు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కూడా అసత్యప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌ను తిట్టడానికి ప్రాంతాలకు, నియోజకవర్గాలకు సంబంధం లేని కవి బోడప్పలను మించిన వారిని రప్పించి కులాలపై రెచ్చగొడుతూ...తిక్కల రెడ్లను ఉసిగొల్పారని భూమన మండిపడ్డారు. హింసాయుత రాజకీయాల గురించి ఒక్క రోజు కూడా మాట్లాడని వైఎస్ జగన్‌పై ఇంతటి దారుణమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. కుల రాజకీయాలను పెంచి పోషించే విత్తులో చంద్రబాబు మహావృక్షమయ్యారని భూమన అభివర్ణించారు. వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపాలని బాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు అన్నీ తెలుసని అయితే ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/