Begin typing your search above and press return to search.

బల్ల గుద్దుతున్న భూమన : చంద్రబాబు సర్కార్ ఫోన్ ట్యాప్ చేసిందంతే...?

By:  Tupaki Desk   |   16 Jun 2022 4:30 AM GMT
బల్ల గుద్దుతున్న భూమన : చంద్రబాబు సర్కార్ ఫోన్ ట్యాప్ చేసిందంతే...?
X
పెగాసస్ వివాదం మళ్లీ రాజుకుంటోంది. ఆ మధ్యన అంటే కొద్ది నెలల క్రితం ఏపీ రాజకీయాల్లో మంటలు పుట్టించిన వివాదం ఇది. అపుడు అసెంబ్లీలో దీని మీద అధికార పార్టీ చర్చించి మరీ హౌస్ కమిటీని వేసిన సంగతి విధితమే. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ వివాదానికి మూల కారణం.

ఆమె బెంగాల్ అసెంబ్లీలో అన్నట్లుగా ప్రచారంలోకి వచ్చిన విషయం ఏంటంటే పెగాసస్ స్పైవేర్‌ను తమ వద్దకు వచ్చి కొనాలని చెప్పినా కొనలేదని, నాడు ఏపీ సర్కార్ మాత్రం కొందని చెప్పి మమత సంచలన కామెంట్స్ చేశారు.

దాంతో వైసీపీ చేతికి అది బ్రహ్మాండమైన అస్త్రం ఐయింది. ఇక అంతే దాని మీద అసెంబ్లీలో చర్చించేసి సీనియర్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చైర్మన్ గా హౌస్ కమిటీని వేశారు కూడా. ఇక భూమన అధ్యక్షన తాజాగా సమావేశం అయిన హౌస్ కమిటీ అయితే పెగాసస్ విషయంలో నాటి సర్కార్ తప్పు చేసిందని, నిఘా పరికరాలను కొనుగోలు చేసిందని ఆరోపిస్తున్నారు.

ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారు కూడా అని ఆయన ఘాటైన ఆరోపణలు చేశారు. అన్ని ఆధారాలను వెలికి తీసి మరీ చంద్రబాబు నాడు చేసిన నిఘా గుట్టుని రట్టు చేస్తామని భూమన చెబుతున్నారు. నాటి టీడీపీ సర్కార్ వ్యక్తులనే కాకుండా ప్రైవేట్ సంస్థలు పార్టీల మీద కూడా నిఘా పెట్టిందని పేర్కొన్నారు.

కీలకమైన సమాచారం దొంగిలించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగినట్లుగా నమ్ముతున్నట్లుగా చెప్పారు. ఈ విషయాన్ని అంత తేలికగా వదలబోమని ఆయన అంటున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ పెగాసస్ దోషులను పట్టుకుని ప్రజల ముందు నిలబెడతమని భూమన అంటున్నారు. మొత్తానికి గత సర్కార్ పెగాసస్ పేరిట నిఘా పెట్టిందని భూమన నమ్ముతున్నారు, చాలా గట్టిగానే బల్ల గుద్దుతున్నారు.

మరి కీలక ఆధారాలు ఉన్నాయని వెలికి తీస్తామంటున్న భూమన వారు వాటిని ఎపుడు బయట పెడతారో చూడాలి. ఇప్పటికే ఆర్ధిక ఐటీ అధికారులతో హౌస్ కమిటీ సమావేశమై కొంత సమాచారం సేకరించింది. తిరిగి జూలై 5,6 తేదీలలో మరో మారు సమావేశం కావాలని నిర్ణయించింది. మొత్తానికి పెగాసస్ మంటలు ఇప్పట్లో ఆరేవి కావు అని భూమన మాటల బట్టి అర్ధం అవుతోంది.