Begin typing your search above and press return to search.

అలిపిరి దాడికి వైఎస్ లింకు ఏంటి బాబు?

By:  Tupaki Desk   |   8 Aug 2017 4:48 PM GMT
అలిపిరి దాడికి వైఎస్ లింకు ఏంటి బాబు?
X
చిత్తూరు జిల్లా అలిపిరిలో తనపై బాంబు దాడి జరిగినప్పుడు తన మనుషులు ఇరుక్కోకూడదని దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నించార‌ని ఏపీ సీఎం - టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించ‌డాన్ని వైసీపీ సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. మందుపాతర పేల్చిన నక్సల్స్‌కు సెల్‌ఫోన్లు ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు గంగిరెడ్డేనని చెప్ప‌డం వాస్త‌వ విరుద్ధ‌మ‌ని భూమ‌న అన్నారు.చంద్రబాబుపై హత్యాయత్నం కేసులో గంగిరెడ్డిలేరని కోర్టు చెప్పిందని భూమ‌న గుర్తు చేశారు. చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు నక్సలైట్లది ఉన్మాద చర్యని వైఎస్‌ఆర్ అన్నారని భూమన గుర్తుచేశారు. తిరుపతిలో గాంధీ విగ్రహం సాక్షిగా వైఎస్ దీక్ష చేశారని, అయినా అలిపిరి దాడిలో వైఎస్ ప్రమేయం ఉన్నట్లు బాబు మాట్లాడుతున్నారని భూమ‌న మండిప‌డ్డారు.

దురుద్దేశాలు, కుట్ర‌ల‌కు మారుపేరు చంద్ర‌బాబు అని భూమ‌న మండిప‌డ్డారు. చంద్రబాబు నిజస్వరూపం ఏంటో ఆనాడే ఎన్టీఆర్ చెప్పారని, నమ్మినవాళ్ల గొంతు కోసేవాడు చంద్రబాబుఅని భూమ‌న‌ అన్నారు. ``నువ్వు ఫినిష్ అవుతావో..? నేను ఫినిష్ అవుతానో..? తేల్చుకుందాం`` అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్న మరుసటి రోజే వైఎస్‌ఆర్ మరణించారని భూమ‌న అన్నారు. చంద్రబాబు నరరూప రాక్షసుడని చరిత్ర చెబుతోందని... హత్యా రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని భూమన మండిప‌డ్డారు. వంగవీటిని ఘోరాతిఘోరంగా చంపించార‌ని, ఆ కుట్రదారుడు చంద్రబాబేనని స్వయంగా హరిరామ జోగయ్య చెప్పారని గుర్తు చేశారు. మల్లెల బాబ్జీ అనే ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యకు కారణం చంద్రబాబేన‌న‌ని భూమ‌న‌ ఆరోపించారు. పరిటాల రవి హత్య వెనుక జగన్ హస్తముందని ప్ర‌చారం జ‌రిగితే...సీబీఐ విచారణ వేయించిన మహానేత వైఎస్‌ఆర్ అని భూమ‌న తెలిపారు.

నీతి, నిజాయితీ, విలువల గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని భూమ‌న అన్నారు. ``నీ తమ్ముడు రామ్మూర్తి నాయుడిని నీవు తిట్టిన తిట్లు నాకు తెలుసు. రామ్మూర్తి నాకు చెప్పిన మాటలు మీడియాకు చెబితే బాగుండదని ఆగిపోతున్నాను. సొంత తమ్ముడ్ని కూడా శత్రువులా చూసిన నీచ చరిత్ర నీది. చంద్రబాబు మాటలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు`` అని భూమన స్ప‌ష్టం చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 400 మందిని చంద్రబాబు చంపించారని ఆరోపించారు. హత్యల గురించి చంద్రబాబు మాట్లాడితే...దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందని భూమ‌న అన్నారు. త‌మ‌ నాయకుడు చంద్ర‌బాబులాగా పిరికిపంద కాదని స్ప‌ష్టం చేశారు. జైల్లో ఉండి కూడా ధైర్యంగా యుద్ధం చేసిన నేత వైఎస్ జగన్ అని భూమన స్ప‌ష్టం చేశారు. రాజకీయాలంటే అధికార దాహం తప్ప నీకేం తెలుసని ప్ర‌శ్నించారు. జగన్ నీడను చూసి కూడా చంద్రబాబు భయపడుతున్నారని భూమన వ్యాఖ్యానించారు.