Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వ్యూహంతో.. భూమ‌న శాంతించిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   1 Aug 2021 12:30 AM GMT
జ‌గ‌న్ వ్యూహంతో.. భూమ‌న శాంతించిన‌ట్టేనా?
X
వైఎస్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు, దివంగ‌త వైఎస్‌తో ఎంతో ప‌రిచ‌యం ఉన్న నాయ‌కుడు.. సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌.. భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్ర‌స్తుతం తిరుప‌తి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాక‌ర్‌రెడ్డి.. వైసీపీ కోసం క‌ష్టించిన నాయ‌కుల్లో ముఖ్యుర‌నే చెప్పాలి. నిజానికి చిత్తూరు జిల్లాలో వ‌ర్గ పోరు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. అలాంటి వాస నల‌కు దూరంగా పార్టీ కోసం ఆయ‌న కృషి చేశారు. 2014లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న ఓడిపోయారు. దీంతో వైసీపీలో ఆయ‌న‌కు ఒకింత ప్రాధాన్యం త‌గ్గిపోయి.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్గం.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించింది. ఆ స‌మ‌యంలో పార్టీ మారాల‌ని.. టీడీపీలోకి వ‌స్తే.. మంచి ప‌ద‌వి ఇస్తామ‌ని.. ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

అయిన‌ప్ప‌టికీ.. భూమ‌న వైసీపీని విడిచిపెట్ట‌కుండా కొన‌సాగారు. అంతేకాదు.. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేసిన‌ప్పుడుతాను కూడా సంఘీభావ యాత్ర చేసి.. పార్టీలో కొంత ఒర‌వ‌డి సృష్టించారు. త‌ర్వాత‌.. చాలా మంది నాయ‌కు లు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర‌లు చేశారు. ఇలా పార్టీని నిల‌బెట్టి.. ముఖ్యంగా బ‌ల‌మైన టీడీపీ సెంటిమెంటును సైతం ప‌క్క‌న పెట్టించ‌గ‌లిగిన నాయ‌కుడిగా భూమ‌న గుర్తింపు పొందారు. ఈ క్ర‌మంలోనే 2019లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకు న్నారు. అయితే.. పార్టీకోసం కృషి చేసిన త‌న‌కు కేబినెట్‌లో చోటు ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ.. జ‌గ‌న్ ఆయ‌న‌ను దూరం పెట్టారు. ఈ స‌మ‌యంలోనే టీటీడీ బోర్డులోనూ ఆయ‌న చోటు కోసం ప్ర‌య‌త్నించారు.

పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు తో ఉన్న వివాదాల కార‌ణంగా.. ఈ అవ‌కాశం కూడా భూమ‌న‌కు ద‌క్క‌లేదు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న ఒకింత ఆగ్ర‌హంతోనే ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గం నిధులు ఇవ్వ‌క‌పోవ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ.. ఆయ‌న కొన్ని రోజులు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇలా.. పార్టీపైనా.. పార్టీ అధినేత‌పైనా.. అస‌హ‌నంతో ఉన్న భూమ‌న చివ‌రి ప్ర‌య‌త్నంగా.. త‌న కుమారుడు అభిన‌య్ రెడ్డికైనా ప్రాధాన్యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఇటీవ‌ల జ‌రిగిన‌స్థానిక ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి వార్డు టికెట్‌ను ద‌క్కించుకుని గెలిపించుకున్నారు. యువ నాయ‌కుడిగా.. జ‌గ‌న్‌కు ప‌రిచ‌యం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. జిల్లాలో నెల‌కొన్ని ఓ మంత్రి వ‌ర్గ పోరుతో.. భూమ‌న‌కు క‌లిసి రాలేదు.

త‌న కుమారుడిని మేయ‌ర్ చేయించాల‌ని అనుకున్న భూమ‌న ఆశ‌ల‌పై ఆదిలోనే నీళ్లు ప‌డ్డాయి. దీంతో డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వినైనా త‌న కుమారుడికి ఇవ్వాల‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ద్వారా.. జ‌గ‌న్‌కు విన్న‌పాలు చేశారు. అయితే.. అది కూడా ద‌క్క‌లేదు. దీంతో ఇక‌, వైసీపీలో త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఈ స‌మ‌యంలో అనూహ్యంగా జ‌గ‌న్‌.. అభిన‌య్ రెడ్డికి రెండో డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. తాజాగా జ‌రిగిన ప‌ద‌వుల పంప‌కంలో అభిన‌య్ రెండో డిప్యూటీ మేయ‌ర్ అయ్యారు. దీంతో భూమ‌నను శాంతింప‌జేసేందుకే జ‌గ‌న్ ఈ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ప‌రిణామంతో అయినా.. భూమ‌న శాంతిస్తారో లేదో చూడాలి.