Begin typing your search above and press return to search.

తిరుపతి సాక్షిగా భువనేశ్వరి ఎంట్రీ... ?

By:  Tupaki Desk   |   19 Dec 2021 12:51 PM GMT
తిరుపతి సాక్షిగా భువనేశ్వరి ఎంట్రీ... ?
X
రాజకీయాల్లో కొత్త ముఖాలను చూడాలనుకునే వారికి వారసులే కనిపిస్తారు. అది పరిపాటి కూడా. ఒక కుటుంబంలో ఎవరికైనా రాజకీయ వాసనలు ఉంటే మిగిలిన వారు దాన్ని అనుసరించడం సహజం. అయితే తండ్రి ఎనిమిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక భర్త పద్నాలుగేళ్ల పాటు సీఎం గా ఉన్నారు. అయినా సరే ఆమె ఎన్నడూ రాజకీయాల్లోకి రాలేదు. కానీ ఈ మధ్య చోటు చేసుకున్న అనేక పరిణామాలు ఆమెను అనవసరంగా రాజకీయ ఉచ్చులోకి లాగేశాయి. ఆమె ఎవరో కాదు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.

భువనేశ్వరి ఇప్పటిదాకా హెరిటేజ్ యజమానిగానే తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉన్నారు. ఇక ఆమె ఎన్టీయార్ మెమోరియల్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా కూడా బాధ్యతలు చూస్తున్నారు. అలాంటి ఆమె మీద ఇటీవల అసెంబ్లీలో కొందరు వైసీపీ నేతలు అనుచితమైన వ్యాఖ్యలు చేశారన్న దాని మీద ఏపీలో రాజకీయ కాక ఒక్క లెక్కన చెలరేగింది. చంద్రబాబు అయితే ఏకంగా మీడియా ముఖంగా ఎన్నడూ లేని విధంగా వెక్కి వెక్కి ఏడ్చారు.

ఆ తరువాత గౌరవ సభలు పేరిట వైసీపీ వైఖరిని తూర్పారా పడుతూ టీడీపీ ఊరూ వాడా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైన కామెంట్స్ చేస్తున్నారు అన్నది కూడా గల్లీ నుంచి సిటీస్ దాకా తమ్ముళ్ళు విడమరచి వివరిస్తున్నారు. ఇక ఆ మధ్య చంద్రబాబు కడప చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో వరదల వేళ పరామర్శకు వెళ్ళినపుడు కూడా తన కుటుంబాన్ని నానా మాటలు వైసీపీ నేతలు అంటున్నారు అని చెప్పుకున్నారు.

ఇక ఇపుడు ఏకంగా చంద్రబాబు సతీమణి తిరుపతిలో పర్యటించబోతున్నారు. ఈ మధ్య వరదల కారణంగా చనిపోయిన, నష్టపోయిన 48 కుటుంబాలను ఈ నెల 20వ తేదీన స్వయంగా పరామర్శిస్తారు. అలాగే ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వంతున ఎన్టీయార్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి ఆమె అందిస్తారు. తిరుపతిలో భువనేశ్వరి పర్యటన నేపధ్యంలో రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఏర్పడుతోంది.

గతంలో ఎపుడూ ఆమె ఇలా బయటకు రాకపోవడం ఇపుడు కూడా ఆమె వస్తున్నది ఒక సామాజిక సేవా కార్యక్రమానికి అయినప్పటికీ ఆసక్తి మాత్రం ఎక్కువగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ కాంపెయినర్ గా భువనేశ్వరి ఉంటారని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. దానికి తోడు ఆమె ఇలా సడెన్ గా పర్యటనలు చేపట్టడం అంటే కచ్చితంగా దీని వెనక అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి భువనేశ్వరి టూర్ ఎలా సాగింది అన్న దాని మీదనే టీడీపీ ఫ్యూచర్ పాలిటిక్స్ మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.