Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన నారా భువనేశ్వరి

By:  Tupaki Desk   |   26 Nov 2021 7:46 AM GMT
అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన నారా భువనేశ్వరి
X
శాసనసభలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు తొలిసారి స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు తనను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి ఒక లేఖ విడుదల చేశారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల స్పందించి నిరసన తెలియజేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకూడదన్నారు.

‘నాపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకి, కూతురికి జరిగినట్లు భావించి అండగా నిలబడటం జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి మా అమ్మనాన్న విలువలతో పెంచారు. నేటికి మేం వాటిని పాటిస్తున్నాం’ అని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

విలువలతో కూడిన సమాజం కోసం అందరూ కృషి చేయాలని హితవు పలికారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడాలని నారా భువనేశ్వరి అన్నారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదన్నారు. నాకు జరిగిన ఈ అవమానం ఎవరికీ జరగకూడదని భువనేశ్వరి స్పష్టం చేశారు.

మొత్తంగా తనపై అసభ్య వ్యాఖ్యలు చేయడం.. భర్త అయిన చంద్రబాబు కన్నీళ్ల పర్యంతం అయిన తర్వాత భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.