Begin typing your search above and press return to search.

అగ్ర‌రాజ్యంలో విభిన్న ప‌రిస్థితులు.. బైడెన్ ఐక్య‌త‌ను సాధిస్తారా?

By:  Tupaki Desk   |   22 Nov 2020 12:30 AM GMT
అగ్ర‌రాజ్యంలో విభిన్న ప‌రిస్థితులు.. బైడెన్ ఐక్య‌త‌ను సాధిస్తారా?
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు ముగిశాయి. కానీ, ఫ‌లితం మాత్రం ఇంకా దోబూచులాడుతూనే ఉంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును బ‌ట్టి చూస్తే.. జో బైడెనే త‌దుప‌రి అధ్య‌క్షుడు. అయితే, ఎన్నిక‌ల్లో పోలింగ్ జ‌రిగిన తీరును గ‌మ‌నిస్తే.. నెక్ టు నెక్‌! అనే త‌ర‌హాలో ఇద్ద‌రు నేత‌లు.. ట్రంప్‌-బైడెన్‌ల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ప్ర‌జ‌లు చాలా వ్యూహాత్మ‌కంగా ఓటు వేశార‌నే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. స‌రే! ఇప్పుడు బైడెన్‌కే 270 ఎల‌క్టోర‌ల్ సీట్లు ల‌భించాయి క‌నుక‌.. ఆయ‌నే అధ్య‌క్ష పీఠం ఎక్కనున్నారు.

అయితే, అమెరికా ప‌రిస్థితి ఇప్పుడు భిన్న‌మైన దారిలో న‌డుస్తోంది. ఆది నుంచి `అంద‌రూ స‌మాన‌మే..` అనే భావ‌న అగ్ర‌రాజ్యాన్ని క‌లిపి ఉంచుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ట్రంప్ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత దేశంలో వ్య‌క్తుల మ‌ధ్య జాతుల మ‌ధ్య విభ‌జ‌న రేఖ పెరిగిపోయింద‌న్న‌ది వాస్త‌వం. బ్లాక్స్‌-వైట్స్ అనే భావ‌న‌తో అమెరికా అస్థిర‌త్వంలో ప‌డిపోయింది. ప్ర‌జ‌ల అభిప్రాయాలు కూడా మారిపోయాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల ఆదాయం కూడా త‌గ్గిపోయింద‌నే నివేదిక‌లు మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

ఇక‌, ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి క‌రోనా సృష్టించిన విల‌యం.. అమెరిక‌న్ల‌ను మ‌రింత కుదుపున‌కు గురి చేసిం ది. ఇప్ప‌టికీ.. క‌రోనా ప్ర‌భావం అమెరిక‌న్ల‌పై క‌నిపిస్తూనే ఉంది. మ‌రోవైపు.. క‌రోనా కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత కుదేలైంది. దీంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర అల‌జ‌డి రేగింద‌నే అనాలి. కానీ, ఈ ప్ర‌భావం.. ఎన్నిక‌ల్లో క‌నిపిస్తే.. ట్రంప్‌ను ఘోరంగా ఓడించేవారు. అయితే. అలా జ‌ర‌గ‌లేదు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు రెండుగా చీలిపోయిన భావ న క‌నిపిస్తోంది. అంటే.. స్థానికుల‌కు ఉద్యోగాలు, స్థానిక జ‌పం వంటివాటిని స‌మ‌ర్ధించేవారు ట్రంప్‌కే ఏక‌ప‌క్షంగా ఓట్లు వేశారు.

అదే స‌మ‌యంలో దేశ భ‌విత‌వ్యాన్ని, బైడెన్ నాయ‌క‌త్వంలో దేశంలో బ్లాక్స్‌-వైట్స్ విభేదాలు త‌గ్గుతాయ‌నే వారు ఆయ‌న‌కు అనుకూలంగా మొగ్గుచూపారు. అయితే.. ట్రంప్ క‌రోనా విష‌యంలో చేసిన వాగ్దానాలు, చూపిన నిర్ల‌క్ష్యం వంటివి ఒకింత ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది.ఇక‌, బైడెన్ అంత‌ర్జాతీయ సంబంధాలు, ఆర్థిక విష‌యాలు.. వంటివాటిలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఉంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుతం దేశం ఎదుర్కొంటున్న ఒక అస్థిర వాతావ‌ర‌ణాన్ని ఆయ‌న స‌మ‌ర్ధంగా ఎదుర్కొని ప‌రిష్క‌రిస్తార‌నే ఇక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తున్నారు. అమెరిక‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య ఐక్య‌త‌ను సాధించ‌డం, గ‌న్ సంస్కృతికి చెక్ పెట్ట‌డం.. క‌రోనాతో దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్ట‌డం బైడెన్ ముందున్న ప్ర‌ధాన స‌వాళ్లుగా క‌నిపిస్తున్నాయి.