Begin typing your search above and press return to search.

బైడెన్ వార్నింగ్ పట్టించుకోలేదు.. 72 ప్రాణాలు పోయాయి

By:  Tupaki Desk   |   27 Aug 2021 3:30 AM GMT
బైడెన్ వార్నింగ్ పట్టించుకోలేదు.. 72 ప్రాణాలు పోయాయి
X
భారత కాలమానం ప్రకారం.. గురువారం మధ్యాహ్న వేళలో.. ఒక వార్త బ్రేకింగ్ న్యూస్ గా వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ఒక ఊహించని హెచ్చరిక వచ్చింది. ఆఫ్గాన్ లో ఉన్న అమెరికన్లు కాబూల్ ఎయిర్ పోర్టులో ఉండొద్దని.. తీవ్ర దాడి జరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు.. వెంటనే ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోవాలని సూచన చేసింది. ‘కాబూల్ ఎయిర్‌పోర్ట్ బయట ప్రజల భద్రతకు ముప్పు నెలకొన్న నేపథ్యంలో అక్కడి అమెరికన్ ప్రజలు ఎయిర్‌పోర్ట్‌కు రావద్దని సూచిస్తున్నాం. అమెరికన్ ప్రభుత్వం నుంచి ఎవరైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌కు ఆహ్వానించేవరకు ఎయిర్‌పోర్ట్‌ వైపు రావద్దు’ అని అమెరికన్ ఎంబసీ స్పష్టం చేశారు

అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ట్విటర్ ఖాతాలో.. ‘ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ ప్రజలను, మా ఆఫ్ఘన్ మిత్రులను, భాగస్వాములను, అలాగే తమకు సాయం చేసినందుకు తాలిబన్ల టార్గెట్‌గా ఉన్న ఆఫ్ఘన్ దేశ ప్రజలను అక్కడి నుంచి తరలించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. వారిని భద్రంగా తరలించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం’ అని జో బైడెన్ పేర్కొన్నారు.

ఇలాంటి వేళ.. అనుకున్నట్లే దారుణమైన రీతిలో దాడి జరిగింది. ఎయిర్ పోర్టు వద్ద చోటు చేసుకున్న పేలుళ్ల దెబ్బతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక పేలుడు ఎయిర్ పోర్టు గేట్ బయట జరగ్గా.. మరో పేలుడు బ్యారన్ హోటల్ వద్ద జరిగింది. మానవ బాంబుల సాయంతోనే ఈ దాడులు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పేలుళ్లను అమెరికా రక్షణ శాఖ సైతం ధ్రువీకరించింది. పేలుళ్లకు ఐసిస్ బాధ్యులుగా తాలిబన్లు చెబుతున్నారు. ఈ దారుణంలో మొత్తం 13 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది అమెరికన్లు.. ఆఫ్గన్లు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

వరుస పేలుళ్లతో కాబూల్ విమానాశ్రయం వద్ద భీతావాహ పరిస్థితినెలకొందని చెబుతున్నారు. పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టినా.. బాధితుల సంఖ్యగా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. మరణించిన వారు 72 మంది ఉండగా.. పెద్ద ఎత్తున గాయాల బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం 150 మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. వారందరిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఉదంతంపై ప్రపంచ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాలిబన్ల తీరును తప్పు పడుతున్నారు. దీనికి బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.

మృతుల్లో 11 మంది అమెరికన్ మెరీన్ కమాండోలు.. ఒక నేవీ వైద్యుడు ఉన్నట్లుగా అమెరికా తెలిపింది. తీవ్రంగా గాయపడిన వారిలో అమెరికా సైనిక సిబ్బందికి చెందిన వారు 12 మంది ఉండగా.. రానున్న కొద్ది గంటల్లో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని చెబుతున్నారు. ఈ పేలుళ్లను తాలిబన్లు ఖండించటం గమానార్హం. అమెరికాతో పాటు పలు దేశాల నేతలు బాంబుపేలుళ్లపై హెచ్చరించగా.. తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కొట్టిపారేశారు. అలాంటిది జరగదని స్పష్టం చేశాడు. అప్గాన్ నుంచి తరలింపు ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి దాడి జరగబోదని అభయమిచ్చారు. ఈ నెల 31 వరకు షరతు పెట్టారు. కానీ.. గడువు ముగియక ముందే ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. కాబూల్ పేలుళ్లను భారత్ ఖండించింది. ఈ ఘటనపై బైడెన్ స్పందించారు. ఇందుకు బాధ్యులు తగిన మూల్యం చెల్లిస్తారని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదులు హతమైనా.. పోయిన ఈ ప్రాణాలు అయితే తిరిగి రావుగా?