Begin typing your search above and press return to search.

బైడెన్ 'భారతీయం'.. ట్రంప్ కంటే 50 శాతం ఎక్కువే..

By:  Tupaki Desk   |   25 Aug 2022 2:30 AM GMT
బైడెన్ భారతీయం.. ట్రంప్ కంటే 50 శాతం ఎక్కువే..
X
అందరి కలల దేశం అమెరికా.. ఆ దేశాన్ని అందుకోవాలని ఎందరో ప్రయత్నిస్తుంటారు.. మన భారతీయులైతే మరీనూ.. టెక్నాలజీ పెరగడం.. అవకాశాలు మరింత వ్యాపితం కావడంతో భారతీయులకు అమెరికా మరింత సన్నిహిత దేశం అయిపోయింది. విద్య, ఉద్యోగం బాటలో లక్షలాది మంది మనవారు అగ్ర దేశం చేరుతున్నారు. అక్కడ పుట్టి, అక్కడే పెరిగి.. వ్యాపారంలో అత్యంత విజయవంతం అయినవారూ ఉన్నారు. విదేశంలో.. అందులోనూ అమెరికా వంటి దేశంలో జయకేతనం ఎగురవేసిన ఇలాంటివారిని భరత మాత కీర్తి పతాకాలుగా కొనియాడవచ్చు.

అన్ని రంగాల్లోనూ మన ముద్ర అమెరికాలో విద్యలో.. వ్యాపారంలోనే కాదు.. చాలా రంగాల్లోనూ భారతీయుల పాత్ర పెరుగుతోంది. నాసా వంటి అగ్రశ్రేణి సంస్థల్లోనూ భారతీయుల శక్తియుక్తులు ఉంటున్నాయి. అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర చాటిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి.. 25 ఏళ్ల కిందట ఏ పేరు వింటేనే భారతీయులు అబ్బురంగా భావించేవారో అలాంటి మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ అయిన సత్య నాదెళ్ల.. ప్రపంచాన్నే శాసిస్తున్న గూగుల్ వంటి దిగ్గజానికి సారథిగా ఉన్న సుందర్ పిచయ్.. ఇలా ఒకరిద్దరేమిటి..? చెప్పుకుంటే పోతే చాలా. అయితే, రాజకీయాల్లోనూ మనవారి పాత్ర మెరుగవుతోంది. అందుకు నిదర్శనమే.. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్.

బైడెన్ భారతీయ కార్యవర్గం "అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది.." అగ్రరాజ్యం గురించి అందరూ చెప్పే మాట. అంటే.. ఆ దేశం తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో చెప్పాల్సిన పనిలేదు. కాగా, ఇలాంటి నిర్ణయాల వెనుక ఉండేది అధ్యక్షుడు, ఆయన కార్యవర్గం. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గాన్ని గమనిస్తే.. మన భారతీయులు 130 మందికి పైగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అంటే.. కీలక నిర్ణయాల్లో మనవారి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవచ్చు. వాస్తవానికి అమెరికా జనాభా దాదాపు 40 కోట్లు అనుకుంటే.. అందులో మనవారు 40 లక్షలు. అంటే ఒక శాతం. కేవలం ఒక శాతం ఉన్న భారతీయులు.. అమెరికా అధ్యక్షుడి కార్యవర్గంలో 130 మందికి పైగా ఉండడం విశేషమే.

మాట నిలబెట్టుకున్న బైడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కంటే ఎక్కువ మంది భారతీయులకు కార్యవర్గంలో చోటిస్తానని ఎన్నికల సందర్భంగా బైడెన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని నిలుపుకొన్నారు. ట్రంప్‌ 80 మంది భారతీయులకు కార్యవర్గంలో చోటివ్వగా, ఆయనకు ముందు అధ్యక్షుడిగా 8 ఏళ్లున్న ఒబామా కార్యవర్గంలో 60 మంది ప్రవాస భారతీయులకు కార్యవర్గంలో చోటుదక్కింది. "ఇండో-అమెరికన్లు సేవా గుణం ఉన్న వ్యక్తులు. ప్రైవేటు రంగాల కంటే ప్రభుత్వ రంగాల్లో సేవలు అందించాలనే ఉత్సాహంతో ఉంటారు. బైడెన్‌ కార్యవర్గంలో పెద్ద సంఖ్యలో భారతీయులను నియమించడం గానీ, నామినేట్‌ చేయడం గానీ చేశారు. అమెరికాలో మన భారతీయుల విజయాలకు గర్వించాలి" అని సిలికాన్‌ వ్యాలీ వెంచర్‌ క్యాపిటలిస్టు ఎం.ఆర్‌. రంగస్వామి పీటీఐతో పేర్కొన్నారు.

ఆయన ఇండియాస్‌పొర సంస్థకు అధిపతిగా ఉన్నారు. ఈ సంస్థ అమెరికాలో భారత మూలాలు ఉన్న కీలక వ్యక్తుల వివరాలు సేకరిస్తుంది. బైడెన్‌ ప్రసంగాల రచయిత వివేక్‌ రెడ్డి, కొవిడ్‌-19 విషయంలో సలహాదారు డాక్టర్‌ ఆశీష్‌ ఝా, క్లైమెట్‌ పాలసీ సలహదారు సోనియా అగర్వాల్‌, క్రిమినల్‌ జస్టిస్‌పై ప్రత్యేక సలహాదారు చిరాగ్‌ బయాన్స్‌, పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ కిరణ్‌ అహూజ, సీనియర్‌ అడ్వైజర్‌ నీరా టండన్‌ వంటి వారు ఉన్నారు.

గత వారం స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా అమెరికాలోని భారత రాయబారి తరణ్‌ జీత్‌సింగ్‌ సంధు నిర్వహించిన కార్యక్రమానికి బైడెన్‌ కార్యవర్గంలో కీలక స్థానాల్లో ఉన్న భారతీయులు అందరూ హాజరయ్యారు. రొనాల్డ్‌ రీగన్‌ తొలిసారి భారతీయులను అధ్యక్ష కార్యవర్గంలోకి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక పలు రాష్ట్రాల్లో వివిధ చట్టసభల్లో దాదాపు 40 మంది ఇండో-అమెరికన్‌ భారతీయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు కూడా ఉన్నారు. ఇక దాదాపు 20 మంది భారతీయులు అమెరికాలోని టాప్‌ కంపెనీల్లో కీలక కొలువుల్లో ఉన్నారు.