Begin typing your search above and press return to search.

దొందూ దొందే.. మీడియా విషయంలో మోడీ.. బైడెన్ ఇద్దరూ ఇద్దరే

By:  Tupaki Desk   |   25 Sep 2021 3:57 AM GMT
దొందూ దొందే.. మీడియా విషయంలో మోడీ.. బైడెన్ ఇద్దరూ ఇద్దరే
X
కాలం కరిగే కొద్దీ ఆయా రంగాల్లో విలువలు పడిపోవటం కొత్త విషయమేమీ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి రాజకీయనేతల తీరుకు.. పాలకుల పద్దతులకు.. ఇప్పటికి ఏమైనా పోలిక ఉందా? రోజులు గడిచే కొద్దీ పరిస్థితుల్లో మార్పులు రావొచ్చు. ఏదో జరిగిపోతుందన్న బాధ కంటే కూడా.. తగ్గుతున్న విలువల్ని పెంచేందుకు తమ వంతు ప్రయత్నంగా అత్యుత్తమ స్థానాల్లో ఉండాల్సిన వారు చేయాల్సిన పని. కానీ.. అలాంటి ఆలోచనలు తమకేమీ లేవన్నట్లుగా ప్రపంచంలో రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలకు చెందిన అధినేతలు తమ మాటలతో స్పష్టం చేయటానికి మించిన దురదృష్టం ఇంకేం ఉంటుంది. ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల్లో మీడియా ఒక పిల్లర్ అన్నది మర్చిపోకూడదు. కానీ.. అలాంటి విభాగాన్ని అధినేతలు గుర్తించమన్నట్లుగా వ్యవహరించటం దేనికి నిదర్శనం?

తాజాగా అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సాధారణంగా రాష్ట్రపతి.. ప్రధానమంత్రులు తమ విదేశీ పర్యటనల సందర్భంగా మీడియాను తమ వెంట తీసుకెళుతుంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలతో పాటు.. ఆయా అంశాలు చర్చకు వస్తుంటాయి. ప్రభుత్వ పని తీరును పాత్రికేయులు దగ్గర నుంచి చూసే వీలు ఉంటుంది. కానీ.. ఘనత వహించిన మోడీ ప్రధానమంత్రిగాబాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు చేసిన విదేశీ పర్యటనల్లో దాదాపుగా మీడియాను తన వెంట తీసుకెళ్లలేదనే చెప్పాలి.

మిగిలిన ప్రధానమంత్రులకు భిన్నంగా.. మీడియాతో మాట్లాడే విధానాన్ని పూర్తిగా నిలిపేసిన ఆయన.. ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్న ఆలోచనను కూడా దగ్గరకు రానివ్వటం లేదు. ఇప్పటివరకు దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారిలో మీడియాను ఇంత దూరంగా పెట్టిన పీఎం ఎవరైనా ఉన్నారా? అంటే అది మోడీనే చెప్పాలి. తాజా అమెరికా పర్యటనలోకూడా మోడీ.. తాను ప్రయాణించే విమానంలో మీడియా వారిని వెంట పెట్టుకు తీసుకు వెళ్లింది లేదు.

తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య మీడియా ప్రస్తావన వచ్చింది. అమెరికా మీడియాతో పోలిస్తే భారత మీడియానే మెరుగ్గా ప్రవర్తించిందన్న మాట జోబైడెన్ నోటి నుంచి వచ్చింది. వైట్ హౌస్ కు చేరుకున్న మోడీకి బైడెన్ స్వాగతం పలికారు. దగ్గరుండి ఓవెల్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా మీడియా ప్రస్తావన వారి మధ్య వచ్చింది. అంతేకాదు.. మీ అనుమతితో పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పకూడదని నేను భావిస్తున్నా.. ఎందుకంటే వారు పాయింట్ కు సంబంధించిన ప్రశ్నలు అడగరు’ అని బైడెన్ అంటే.. అందుకు తాను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నట్లు మోడీ వ్యాఖ్యానించటం గమనార్హం. ప్రజలకు సమాచారాన్ని అందించే మీడియాను ఈ ఇద్దరు అధినేతలు ఎలా చూస్తారన్న దానికి నిదర్శనంగా తాజా సంభాషణేనని చెప్పాలి. నిజమే.. మీడియా అనవసరమైన ప్రశ్నలు వేస్తుందనే అధికారంలో ఉన్న వారికి అనిపిస్తుంది. అలా అనుకోవటం ద్వారా మీడియాను దూరంగా పెట్టేసి.. ఏ విషయాల్ని బయటకు రానివ్వకుండా చేయగలిగేది.ఏమైనా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలకు చెందిన పాలకులకు మీడియా మీద ఉన్న అభిప్రాయం తాజా ఉదంతంతో స్పష్టమైందని చెప్పాలి.