Begin typing your search above and press return to search.

మళ్లీ భారత సంతతికి జోబైడెన్ పెద్దపీట

By:  Tupaki Desk   |   15 April 2021 7:32 AM GMT
మళ్లీ భారత సంతతికి జోబైడెన్ పెద్దపీట
X
అమెరికాలో జోబైడెన్ అధ్యక్షుడయ్యాక భారతీయులకు ఆయన ప్రభుత్వంలో పెద్దపీట దక్కుతోంది. ఇప్పటికే 20 మందికి పైగా భారత సంతతి వ్యక్తులను తన టీంలో జోబైడెన్ నియమించుకున్నారు. తాజాగా మరో ఇద్దరు భారత సంతతి మహిళలను కీలక పదవుల్లో నియమించారు.

మీరా జోషి అనే భారతీయ అమెరికన్ ను రవాణాశాఖలోని ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ కు అడ్మినిస్ట్రేటర్ గా నామినేట్ చేశారు. ఇక మరో భారత సంతతి మహిళ రాధిక ఫాక్స్ ను పర్యావరణ పరిరక్షణ సంస్థ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ గా నామినేట్ చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన 2021 జనవరి 20 నాటి నుంచి ఈ ఇద్దరూ ఆయన అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తున్నారు. వారికి తాజాగా ప్రమోషన్లు ఇచ్చి కీలక బాధ్యతలను జోబైడెన్ అప్పగించారు.

మీరా జోషి ఇప్పటివరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ లో డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తుండగా.. ఆమెకు ఇప్పుడు అదేశాఖలో అడ్మినిస్ట్రేటర్ గా ప్రమోషన్ దక్కింది. రాధికా ఫాక్స్ వాటర్ , ఎన్విరాన్ మెంట్ లో డిప్యూటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తోంది. ఇదే శాఖలో ఆమెకు ప్రమోషన్ లభించింది.

సీనియర్ న్యాయవాది అయిన మీరా జోషి ప్రభుత్వ పర్యవేక్షణ సంస్థల్లో దశాబ్ధానికి పైగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ టాక్సీ అండ్ లిమోసిన్ కమిషనర్ చైర్ పర్సన్, సీఈవోగా కూడా పనిచేస్తున్నారు.