Begin typing your search above and press return to search.

అది ఆఫ్ఘన్ తప్పు .. భాద్యత నాదే : బైడెన్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   1 Sep 2021 5:30 AM GMT
అది ఆఫ్ఘన్ తప్పు .. భాద్యత నాదే : బైడెన్ సంచలన వ్యాఖ్యలు
X
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలని ఉద్దేశించి , ఆఫ్ఘన్ సమస్యపై కీలక ప్రసంగం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిన మరుసటి రోజే ఆయన దేశ ప్రజల ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో మకాం వేసిన సైన్యాన్ని పూర్తిగా వెనక్కి పిలిపించడానికి గల కారణాలు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబన్ల జాడ లేకుండా చేశాయి, అమెరికా, నాటో బలగాలు. రెండు దశాబ్దాల పాటు ఆ దేశానికి రక్షణ ఇచ్చాయి. అయితే , ఒక్కసారి అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం ప్రారంభించిందో , ఆ క్షణం నుంచే తాలిబన్లు తమ ఉనికిని మళ్లీ చాటుకుంటూ వచ్చారు.దేశం మొత్తాన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

అమెరికా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవడం వల్ల తాలిబన్లు విరుచుకుపడ్డారని, ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభానికి అగ్రరాజ్యమే కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలోనూ జో బైడెన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. పలు దేశాలు అమెరికా పై ప్రత్యక్షంగానే విమర్శలకి దిగాయి. అయితే అమెరికా వాటిని లెక్కచేయడం లేదు. ఈ పరిణామాల మధ్య అమెరికా.. తన సైనిక బలగాలను ఆప్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంది. ఆగస్టు 31వ తేదీ నాటికి బలగాల ఉపసంహరణను పూర్తి చేస్తామని ఇదివరకే ప్రకటించింది అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్. దీనికి ఇంకా గడువు మిగిలి ఉండగానే , ఆ ప్రక్రియను ముగించేసింది.

దీనిపై తాజాగా జో బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం అనేది అత్యుత్తమ నిర్ణయంగా అభివర్ణించారు. సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవడానికి మించి అమెరికా ముందు మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదని వ్యాఖ్యానించారు. మంచి నిర్ణయంగా,ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా ఆయన పునరుద్ఘాటించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తమ దేశ సైన్యాన్ని మోహరింపజేయడం వల్ల రోజూ 300 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుందని, సైన్యాన్ని బలోపేతం చేసుకోకపోవడం ఆఫ్ఘనిస్తాన్ బలహీనత అని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ ను వీడాలనే నిర్ణయానికి పూర్తి బాధ్యత తానే వహిస్తున్నానని చెప్పారు

17 రోజులుగా నిరంతరాయంగా, విరామం లేకుండా ఈ తరలింపు ప్రక్రియ కొనసాగిందని పేర్కొన్నారు. 1,20,000 అమెరికా పౌరులు, ఆఫ్ఘనిస్తానీయులు, ఇతర దేశాల వారిని తరలించామని బైడెన్ తెలిపారు. తాలిబన్ల ఆక్రమణ మొదలైన తరువాత అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లి.. పెద్ద తప్పు చేశారని జో బైడెన్ విమర్శించారు. ఆయన దేశం విడిచి వెళ్లడంతో అరాచకత్వం పెరిగిందని, అల్లర్లు చెలరేగడానికి ప్రధాన కారణమైందని అన్నారు. ఘనీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు చేశారు.

తాలిబన్లు ఇదివరకటి కంటే బలోపేతం కావడం ప్రమాదకరమని బైడెన్ అన్నారు. తమ దేశ గడ్డ మీద ఉగ్రవాదాన్ని పెంచి పోషించకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని చెప్పారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, చిట్టచివరి ఉగ్రవాదిని మట్టుబెట్టేంత వరకూ అప్రమత్తంగా ఉంటామని వెల్లడించారు. సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయంతో నష్టపోయింది ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటే కాదని.. అమెరికా కూడా నష్టపోయిందని జో బైడెన్ పేర్కొన్నారు. మానసికంగా అలసిపోయిందని చెప్పారు. 20 సంవత్సరాల పాటు పరాయి దేశంలో తాము సేవలను అందించామని, దీనికోసం మిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేశామని అన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఇంకా అక్కడే కొనసాగడం సరికాదు అని తెలిపారు. మొత్తంగా ఆఫ్ఘన్ నుండి అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలిపించడాన్ని సమర్ధించుకున్నారు.