Begin typing your search above and press return to search.

తొలిసారి బైడెన్ నోటి నుంచి షాకింగ్ వార్నింగ్!

By:  Tupaki Desk   |   23 Oct 2021 5:30 AM GMT
తొలిసారి బైడెన్ నోటి నుంచి షాకింగ్ వార్నింగ్!
X
పేరుకు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా.. పాలనతో తనదైన మార్కును చూపించలేకపోతున్నారని.. బలహీన అధ్యక్షుడిగా ఉన్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్న జో బైడెన్ తొలిసారి తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు. తైవాన్ విషయంలో డ్రాగన్ దేశానికి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇంత సూటిగా చైనాకు వార్నింగ్ ను అమెరికా అధ్యక్షుడు ఇవ్వలేదన్న మాట వినిపిస్తోంది.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకోవటం లేదని.. అయితే తైవాన్ మీద చైనా దురాక్రమణకు సిద్ధపడితే తాము చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. చైనా తప్పులు చేస్తూ.. యుద్ధం దిశగా తమను ప్రేరేపిస్తోందన్నారు. తైవాన్ ను కాపాడే విషయంలో వెనకడుగు వేసే ఆలోచన లేదనన్నారు. ఇటీవల కాలంలో తైవాన్ విషయంలో చైనా అడ్డగోలుగా మాట్లాడటం.. తైవాన్ తమ కిందకే వస్తుందని చైనా మొండి వాదనను వినిపించటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తైవాన్ ను తమ దేశంలో కలుపుకోవటానికి ప్రయత్నిస్తున్న చైనా.. తైవాన్ గగనతలంలో చైనా యుద్ధ విమానాలతో విన్యాసాల్ని చేస్తోంది. సరిహద్దుల వెంట సైనిక కవాతు నిర్వహిస్తోంది. ఇలాంటి వేళ.. బైడెన్ ఓపెన్ గా ఇచ్చిన వార్నింగ్ సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు చైనా స్పందించింది. తైవాన్ విషయంలో తాము ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదన్న డ్రాగన్ దేశం.. తైవాన్ తమ భూభాగం కిందకే వస్తుందని మరోసారి వ్యాఖ్యానించింది. మొత్తానికి తైవాన్ విషయంలో తామెంత మొండిగా ఉన్నామన్న విషయాన్ని చెప్పేస్తున్న చైనాకు అమెరికా చెక్ చెప్పటమంటే.. మరోసారి కొత్త ఉద్రిక్తతలకు తెర తీసినట్లే.