Begin typing your search above and press return to search.

శాశ్వత సభ్యత్వంపై భారత్ కు సపోర్టు పలికిన బైడెన్

By:  Tupaki Desk   |   22 Sep 2022 5:31 AM GMT
శాశ్వత సభ్యత్వంపై భారత్ కు సపోర్టు పలికిన బైడెన్
X
ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా ఉన్న దేశంగా మాత్రమే కాదు.. చాలా దేశాలకు భిన్నంగా పరాయి దేశం మీద యుద్ధ కాంక్షతో రగిలిపోవటం.. విస్తరించుకోవాలన్న దుర్బుద్ధి లేని దేశంగా భారత్ కున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అయినప్పటికీ.. భారత్ ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వ హోదా విషయంపై చర్చ ఏళ్లకు ఏళ్లుగా సాగుతూనే ఉంది.

భద్రతామండలిలో శాశ్విత సభ్య దేశాలుగా.. వీటో పవర్ ఉన్న దేశాలుగా అమెరికా.. చైనా.. ఫ్రాన్స్.. రష్యా.. బ్రిటన్ లు మాత్రమే ఉన్నాయి. ఇందులోకి జపాన్.. జర్మనీ.. భారత్ లను కూడా భధ్రతా మండలిలోశాశ్విత సభ్య దేశాలుగా నిలపాలని డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. అయితే.. వీటిపై ఆసక్తి చూపుతున్నట్లు కనిపించినా.. ఈ ఇష్యూ చర్చ దశ దాటి ముందుకు పోని పరిస్థితి.

ఇలాంటివేళ.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక వ్యాఖ్య చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంస్కరణలు చేయాలని భావిస్తున్న వేళ.. జర్మనీ.. జపాన్.. భారత్ లకు శాశ్విత సభ్య దేశాలుగా చేర్చే ప్రతిపాదనపై జో బైడెన్ తన అంగీకారాన్ని తెలిపారు. అయితే.. దీనికి సంబంధించి చేయాల్సిన ప్రక్రియలు చాలానే ఉన్నట్లుగా వైట్ హౌస్ అధికారి వ్యాఖ్యానించటం గమనార్హం.

తాజాగా ఐక్య రాజ్య సమితి వద్ద మాట్లాడిన బైడెన్.. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు మెరుగ్గా ప్రతి స్పందించేలా సంస్థ మరింత సమగ్రంగా మారాల్సిన సమయం వచ్చేసిందని తాను నమ్ముతున్నట్లుగా పేర్కొన్నారు.

యైనైటెడ్ స్టేట్స్ తో సహా యూఎన్ భద్రతా మండలి సభ్యులు ఐక్యరాజ్యసమితి చార్టర్ ను నిలకడగా సమర్థించాలన్న ఆయన.. అసాధారణ పరిస్థితులు మినహా వీటోను ఉపయోగించకుండా ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే కౌన్సిల్ శాశ్వత మరియు శాశ్వత ప్రతినిధుల సంఖ్యను పెంచటానికి తమ దేశం మద్దతు ఇస్తుందన్నారు.

ఎంతోకాలంగా వినిపిస్తున్న డిమాండ్ కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా ముందుకు రావటం.. అందుకు తగ్గట్లుగా తాజాగా వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. భారత్ పట్ల సానుకూలత ప్రదర్శించిన బైడెన్ నిర్ణయం.. ఆయన్ను భారతీయులు మరింత అభిమానించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.