Begin typing your search above and press return to search.

జగన్ తీసుకున్న అతి మంచి నిర్ణయం

By:  Tupaki Desk   |   13 Jun 2020 10:50 AM GMT
జగన్ తీసుకున్న అతి మంచి నిర్ణయం
X
ఒకటి రెండు మూడు నాలుగు మావే.. టాప్ టెన్ లో మేమే.. అత్యధిక ర్యాంకులు మావే.. అంటూ టీవీలు, రేడియోలతో పాటు పత్రికల్లో ఊదరగొట్టేవారు. ఇప్పుడు ఆ చప్పుడు, అరుపులు, కేకల ప్రకటనలు అస్సలు కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. వాస్తవంగా అయితే ఫలితాలు విడుదల కాకముందే కార్పొరేట్, ప్రెవేట్ కళాశాలల లొల్లి ఉండేది. కానీ నిన్న విడుదల చేసిన ఫలితాల తర్వాత అలాంటి ప్రకటనలు ఎక్కడ కనిపించలేదు.

దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణంగా తెలుస్తోంది. ప్రెవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ముకుతాడు వేసేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఫలితాల వెల్లడిలో అనుసరించిన వ్యూహంతో ఆ కళాశాలల యాజమాన్యానికి షాక్ తగిలింది. దీంతో వారు ప్రకటనలు వేసుకునే అవకాశం లేదు. పైగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కళాళాలలు ఇప్పుడే ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. ఇప్పుడే అడ్మిషన్లు మొదలుకాకపోవచ్చు. వీటన్నిటి దృష్ట్యా ప్రైవేటు యాజమాన్యాలు ప్రకటనలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు.

ఫలితాల వెల్లడిలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలతో ఆ కళాశాలలకు ఫలితాలు వెంటనే తెలియలేదు. గతంలో ఫలితాలు రాకముందే వారికి సమాచారం అందేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రజలను పట్టి పీడిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా ఉండడంతో ఆ కళాశాల యాజమాన్యాలు దారిలోకి వచ్చాయి. అందుకే నిన్న, ఈరోజు ప్రకటనలు ఎక్కడా కనిపించలేదు.