Begin typing your search above and press return to search.

బిగ్ బ‌జార్ పిల్ల బుద్ధి బ‌య‌ట‌ప‌డింది

By:  Tupaki Desk   |   16 March 2018 5:44 AM GMT
బిగ్ బ‌జార్ పిల్ల బుద్ధి బ‌య‌ట‌ప‌డింది
X
న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో ఉన్న వారికి బిగ్ బ‌జార్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. అలాంటి ప్ర‌ఖ్యాత సంస్థ లోగుట్టు పిల్ల‌బుద్ధి తాజాగా బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది. క‌స్ట‌మ‌ర్ల‌కు చెప్ప‌కుండా వారి.. బిల్లులో వ‌స్తువులతో పాటు చిల్డ్ర‌న్స్ ఫండ్ పేరుతో వ‌సూలు చేస్తున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

పెద్ద పెద్ద మాల్స్ కు వెళ్లిన‌ప్పుడు.. వ‌స్తువుల్ని వెతుక్కోవ‌టం.. వాటిని ట్రాలీలో వేసుకొని బిల్లింగ్ కౌంట‌ర్ వ‌ద్ద‌కు రావ‌టం తెలిసిందే. అప్ప‌టికే అలిసిపోయే క‌స్ట‌మ‌ర్లు.. బారెడు క్యూ లైన్ల‌లో అదే ప‌నిగా వెయిట్ చేయాల్సి వ‌స్తుంది. త‌మ వంతు బిల్లు వ‌చ్చేస‌రికి ఓపిక న‌శించ‌టం.. బిల్లులో పేర్కొన్న మొత్తాన్ని వెంట‌నే చెల్లించ‌టం చేస్తుంటారు.

పెద్ద లిస్టులో వ‌స్తువుల్ని క్రాస్ చెక్ చేసుకునే టైం ఉండ‌ని ప‌రిస్థితి ఒక‌టైతే.. పెద్ద పెద్ద సంస్థ‌లు బిల్లింగ్‌ లో లోపాలు ఎందుకు చేస్తాయ‌న్న న‌మ్మ‌కం ఒక‌టి.. వారి బిల్లుల్ని క్షుణ్ణంగా చెక్ చేసేలా చేయ‌వు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిందేమో కానీ బిగ్ బ‌జార్ కొత్త త‌ర‌హా దోపిడీకి తెర తీసిన విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రూ.200 పైబ‌డిన‌.. లేదంటే ఆరేడు సామాన్ల కంటే ఎక్కువ వ‌స్తువుల్ని కొనుగోలు చేసిన వారి బిల్లులో వ‌స్తువుల జాబితా కింద చిల్డ్ర‌న్ ఫండ్ పేరుతో రూ.2 చొప్పున ప్ర‌తి బిల్లులో వ‌సూలు చేయ‌టం గ‌మ‌నార్హం.

చూసేందుకు రూ.2 మొత్తం చిన్న‌దిగా క‌నిపించినా.. క‌స్ట‌మ‌ర్ ను అడ‌గ‌కుండా ఎందుకు వ‌సూలు చేస్తున్న‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇదే విష‌యాన్ని గుర్తించిన క‌స్ట‌మ‌ర్లు ఎవ‌రైనా అక్క‌డి సిబ్బందిని ప్ర‌శ్నిస్తే.. కేంద్ర‌ప్ర‌భుత్వం చెప్పినట్లే తాము వ‌సూలు చేస్తున్న‌ట్లుగా వారు చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఒక‌వేళ‌.. కేంద్రం చెప్పి ఉంటే.. ఆ విష‌యాన్ని డిస్ ప్లే చేయాలి క‌దా? అంటే స‌మాధానం రాని ప‌రిస్థితి. స‌రే.. అది కూడా వ‌దిలేద్దామ‌నుకున్నా.. బిల్లులో వ‌సూలు చేస్తున్న మొత్తం వ‌స్తువ‌ల జాబితాలో చివ‌ర‌న ఉండ‌టం క‌నిపిస్తుంది. ఒక‌వేళ ప‌న్ను రూపంలో కానీ.. ఇత‌ర రూపంలో కానీ ప్ర‌త్యేకంగా వ‌సూలు చేయాల్సి ఉంటే.. దాన్ని వేరుగా పేర్కొనాలి. అంతేకానీ.. వ‌స్తువుల జాబితా అడుగున పెట్టి వ‌సూలు చేయ‌కూడ‌దు.

బిగ్ బ‌జార్ పిల్ల బుద్దిపై అధికారులు దృష్టి సారించారు. బిగ్ బ‌జార్ షోరూంల‌లో త‌నిఖీలు నిర్వ‌హించి.. చిల్డ్ర‌న్స్ ఫండ్ గురించి అడ‌గ్గా.. తాము ఒక స్వ‌చ్చంద సంస్థ తో టై అప్ పెట్టుకున్నామ‌ని.. వినియోగ‌దారుల‌కు చెప్పి మ‌రీ తాము వ‌సూలు చేస్తున్ట‌న్లు చెప్ప‌ట‌మే కాదు.. కొన్ని బిల్లుల్లో క‌నిపించిన‌ట్లు రూ.2 కాదు.. రూ.5 నుంచి రూ.100 వ‌ర‌కూ తీసుకొనే వాళ్ల‌మ‌ని.. ఆ మొత్తాన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌కు మ‌ళ్లించామ‌ని చెబుతున్నారు. దానం చేయాల‌న్న స‌ర‌దా ఉంటే బిగ్ బ‌జార్ త‌న‌కు తానుగా చేయాలే కానీ.. వినియోగ‌దారుడి నుంచి బిల్లులో వ‌సూలు చేసి వారికి ఇవ్వ‌టం ఏమిటి?

కొన్ని హోట‌ళ్ల‌లో క్యాష్ కౌంట‌ర్ ద‌గ్గ‌ర ఎవ‌రికైనా సాయం చేయాలంటూ.. ఆ సంస్థ‌కు చెందిన బాక్స్ పెట్ట‌టం క‌నిపిస్తుంది. ఏదైనా స్వ‌చ్ఛంద సంస్థ‌తో టైఅప్ అయితే.. ఆ సంస్థ‌కు చెందిన బాక్స్ లు బిగ్ బ‌జార్ క్యాష్ కౌంట‌ర్ ద‌గ్గ‌ర ఏర్పాటు చేయాలే కానీ.. ఇలా బిల్లులో వేసేస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. బిగ్ బ‌జార్ సిబ్బంది చెప్పిన మాట‌ల‌తో సంతృప్తి చెంద‌ని తూనిక‌లు కొల‌త‌ల శాఖ అధికారులు కేసులు న‌మోదు చేయ‌టం గ‌మ‌నార్హం. సో.. పెద్ద పెద్ద మాల్స్ కు వెళ్లి కొనుగోలు చేసే వారంతా త‌మ బిల్లుల్ని కాస్త చెక్ చేసుకుంటే మంచిది సుమా.