Begin typing your search above and press return to search.

ఏపీ బ్రాండ్ ఇమేజ్ భారీ దెబ్బ... ?

By:  Tupaki Desk   |   25 Oct 2021 2:30 PM GMT
ఏపీ బ్రాండ్ ఇమేజ్ భారీ దెబ్బ... ?
X
రాష్ట్రం అంటే కేవలం రాజకీయాలు, నేతలు మాత్రమే ఉండరు, కోట్లాది జనాలు ఉంటారు. అలా కనుక చూసుకుంటే ఏపీలో అయిదు కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. ఏపీకి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ప్రతీ ఇంటికీ, మనిషికీ ఉంటే ప్రతిష్ట మాదిరిగానే రాష్ట్రానికి కూడా ఉంటుంది. అది ఏ ఒక్క రోజులోనో రాదు, ఏళ్ళ తరబడి ఎందరో ప్రముఖులు శ్రమిస్తేనో దక్కుతుంది. గుండెకు గుండె ఎదురు చూపిన టంగుటూరి ప్రకాశం ఏపీకి బ్రాండ్ అంబాసిడర్, అలాగే తెల్ల దొరలను ఎదిరించిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు ఏపీకి కేరాఫ్ అడ్రస్. నీతి నిజాయతీకు నిలువుటద్ధం వావిలాల గోపాలక్రిష్ణ ఆంధ్రుల గొప్పతనానికి మారు పేరుగా చెబుతారు. ఇక ఒక ఎన్టీయార్, వైఎస్సార్ ఇలా ఎందరిలో ఏపీ చూసింది. ఏపీ నుంచి రాణించిన‌ వారు వివిధ రంగాల్లో పలువురు ఉన్నారు.

అలాంటి ఏపీ బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బ తీసేలా ఈ రోజు రాజకీయాలు జరుగుతున్నాయంటే బాధపడాల్సిందే. మాదక ద్రవ్యాల రవాణాలో ఏపీ నంబర్ వన్ అని ఈ రాష్ట్రాన్ని ఎన్నో ఏళ్ళ పాటు పాలించిన తెలుగుదేశం పార్టీ అంటోంది. డ్రగ్ ఆంధ్రా అని ఢిల్లీ వేదికగా చెబుతోంది. ఏపీలోని ఏజెన్సీలో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతోందని రాష్టపతికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఏపీ అన్ని విధాలుగా నేరాలూ ఘోరాలతో నిండిపోయింది అని కూడా అంటున్నారు. సరే ఇవన్నీ కూడా ఏపీలో వైసీపీ సర్కార్ మీద చేసిన ఆరోపణలు. ఏపీలో రాజకీయ ప్రత్యర్ధిని దెబ్బ తీసేందుకు వేసిన ఎత్తుగడ. కానీ అదే టైమ్ లో ఏపీకి కూడా తెలియకుండానే తాము కలంకిత ముద్ర వేస్తున్నామని మరచిపోతున్నారు.

నిజానికి గంజాయి సాగు అన్నది ఈ రోజు సమస్య కాదు, అలాగే మాదక ద్రవ్యాల విషయంలో కూడా ఏపీ నంబర్ వన్ గా ఏమీ లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చిన నిజాల్లో కూడా ఏపీ లేదు. కానీ ఏపీకి చెందిన వారే తమ రాష్ట్రం మీద బురద జల్లుకుంటే అంతకంటే దారుణం ఉండదేమో. ఏపీలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. ఇక్కడ యువత ఉపాధి కోసం మరో దాని కోసం రేపటి రోజున వేరే రాష్ట్రం వెళ్తే అక్కడ వారి పరిస్థితి ఏంటి. డ్రగ్ ఆంధ్రా నుంచి వచ్చారు అంటూ వారికి శల్య పరీక్షలు చేసి అక్కరలేని టెస్టులు చేస్తే ఆ పాపం ఎవరిది.

రాజకీయం కోసం రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బ తీస్తారా అని మేధావులు ప్రశ్నిస్తే జావాబు రాజకీయ పార్టీలకు ఉందా. ఈ దేశంలో డ్రగ్స్ రవాణా చాలా రాష్ట్రాలలో జరుగుతోంది. కేంద్ర విచారణ సంస్థలు కూడా కొన్ని రాష్ట్రాల పేరు చెప్పాయి. అయినా సరే ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష నాయకులు ఇలా దేశ రాజధానికి వచ్చి మరీ తమ రాష్ట్రం పరువు తీసుకున్నారా. ఏపీకి ఏమైంది, ఎందుకిలా పరువు తీస్తున్నారు నేతాశ్రీలు అంటే సమాధానం ఉందా. ఇంతలా అన్ని రకాలుగా ఇమేజ్ కోల్పోయేలా చేసిన రాష్ట్రానికి రేపటి రోజున ఈ నిందించిన వారే అధికారంలోకి వచ్చినా తెచ్చిన మచ్చ పోతుందా, రాజకీయాలు అంటే ఒక హద్దు పరిధి పరిమితి ఉండాలి కదా. ఏపీ విషయంలో అన్ని రకాలైన అన్యాయాలు అయిపోయాయి, ఇపుడు అపనిందలు కూడానా అని పౌరులెవరైనా నిలదీస్తే జవాబు ఎవరు చెబుతారన్నదే చూడాలి.