Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్‌కు షాక్.. ఆ మంత్రి సోద‌రుడు రాజీనామా!

By:  Tupaki Desk   |   7 Aug 2022 10:22 AM GMT
టీఆర్ఎస్‌కు షాక్.. ఆ మంత్రి సోద‌రుడు రాజీనామా!
X
తెలంగాణ‌లో అధికార టీఎర్ఎస్ పార్టీకి తీవ్ర షాక్ త‌గిలింది. వ‌రంగ‌ల్ జిల్లాలో ఆ పార్టీ కీల‌క నేత‌, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు సోద‌రుడు ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు వ‌రంల్ కోప‌రేటివ్ బ్యాంకు అధ్య‌క్షుడిగా ఉన్నారు. వ‌రంగ‌ల్ తూర్పు టీఆర్ఎస్ ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ తో కొంత‌కాలంగా ఆయ‌న‌కు విభేదాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు నేత‌లు ఇటీవ‌ల బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకున్నారు.

కాగా ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు గ‌త ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ తూర్పు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే కేసీఆర్ ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌లేదు. వ‌రంగ‌ల్ మేయ‌ర్ గా ప‌నిచేసిన న‌న్న‌పునేని న‌రేంద‌ర్ కు ఆ సీటు క‌ట్ట‌బెట్టారు. ఆ త‌ర్వాత త‌న‌కు ఎమ్మెల్సీగా నైనా అవ‌కాశం ఇస్తార‌ని ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు ఆశించారు. అయితే ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్క‌లేదు. మ‌రోవైపు వ‌రంగ‌ల్ తూర్పు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న న‌న్న‌పునేని న‌రేంద‌ర్ తో విభేదాలు తీవ్ర‌మ‌య్యాయి.

ఈ నేప‌థ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు రాజీనామా చేశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.
ఈ మేర‌కు తాజాగా మీడియాతో మాట్లాడిన ప్ర‌దీప్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ లో చేరిన‌ప్ప‌టి నుంచి ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నాన‌న్నారు. అవ‌న్నీ స‌హించినా త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌లేద‌ని ఆక్రోశం వ్య‌క్తం చేశారు. బంగారు తెలంగాణ కోసం తాను, త‌న అనుచ‌రులు ఎన్నో త్యాగాలు చేసినా టీఆర్ఎస్ అధిష్టానం త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని వాపోయారు.

వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే త‌మ‌ను అవ‌మానిస్తూ మాట్లాడార‌ని మండిప‌డ్డారు. సొంత పార్టీ నేత‌లే త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. త మ‌ను ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీలో చేర‌తాన‌న్నారు.. లేదంటే స్వతంత్రంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. కాగా ప్ర‌దీప్ రావు బీజేపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా గ‌తంలో ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నిక‌ల్లో పీఆర్పీ అభ్య‌ర్థిగా వ‌రంగ‌ల్ తూర్పు నుంచి పోటీ చేసిన ఆయ‌న‌కు 35 వేల ఓట్లు వ‌చ్చాయి.