Begin typing your search above and press return to search.

9వ తేది.. ఏపీ రాజకీయాల్లో బిగ్ డే

By:  Tupaki Desk   |   7 March 2019 4:48 AM GMT
9వ తేది.. ఏపీ రాజకీయాల్లో బిగ్ డే
X
దేశవ్యాప్తంగా ఎన్నికల నగరా మోగడానికి కౌంట్ డౌన్ దగ్గర పడింది. రేపో, ఎల్లుండో ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందన్న సంకేతాలు ఢిల్లీ నుంచి వెలువడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసిందని.. ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. షెడ్యూల్ వచ్చిందంటే ఎన్నికల సమరం మొదలైనట్టే..

ఢిల్లీ నుంచి లీకులు మొదలు కావడంతో ఏపీలోని పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. రోజుకు ఒకటి, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలను సమీక్షిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఓ వైపు జగన్ కూడా అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని ఖరారు చేసేశారు.

ఇక ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోను కూడా ఆకర్షణీయంగా తయారు చేసి.. ప్రజలపై వరాల వాన కురిపించేలా సిద్ధం చేస్తున్నాయి టీడీపీ, వైసీపీలు.. టీడీపీలో యనమల ఆధ్వర్యంలో మేనిఫెస్టో సిద్ధం అవుతుండగా.. వైసీపీలో ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో రూపొందుతోంది. షెడ్యూల్ రాగానే బస్సుయాత్ర నిర్వహిస్తానని జగన్ చెప్పిన క్రమంలో అంతకంటే ముందే మేనిఫెస్టోకు తుదిరూపు ఇవ్వాలని వైసీపీ చూస్తోంది. అందులో భాగంగానే మేనిఫెస్టో కమిటీతో చర్చలు జరిపారు జగన్. నవరత్న సంక్షేమ పథకాలే వైసీపీ మేనిఫెస్టోలో కీలకంగా ఉంటున్నాయని సమాచారం.

ఇలా అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి పార్టీలు. కానీ అభ్యర్థుల ఎంపిక, ఖరారు మాత్రమే ఇప్పుడు రెండు పార్టీలకు గుదిబండగా మారుతోంది. అభ్యర్థులను ప్రకటిస్తే అసమ్మతి.. ప్రకటించకపోతే జాప్యంతో పార్టీ పుట్టి మునుగుతుండడంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని టీడీపీ, వైసీపీ కసరత్తు చేస్తున్నాయి. షెడ్యూల్ వచ్చాక చేసేదేమీ ఉండదు కాబట్టి వెంటనే అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల కార్యక్షేత్రంలో దూకడానికి రెండు పార్టీలు రెడీ అయ్యాయి.

రెండు రోజుల్లో షెడ్యూల్ వస్తుందని తేలడంతో టీడీపీ, వైసీపీ ల నుంచి అభ్యర్థుల జాబితా వెలువడుతుందని తెలుస్తోంది. అమావాస్య దాటడంతో 9న ఖచ్చితంగా రెండు పార్టీల జాబితా విడుదలవుతుందని తెలుస్తోంది. ఆరోజే టికెట్ దక్కని నేతలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు చేరికల పర్వం కొనసాగుతుందని తెలుస్తోంది. ఆరోజే టికెట్ కన్ఫం చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 9వ తేది ఏపీ రాజకీయాల్లో బిగ్ డే గా మారబోతోంది.