Begin typing your search above and press return to search.

10వ తరగతి విద్యార్ధులకు పెద్ద రిలీఫ్

By:  Tupaki Desk   |   22 April 2022 4:29 AM GMT
10వ తరగతి విద్యార్ధులకు పెద్ద రిలీఫ్
X
పరీక్షలు రాయబోయే 10వ తరగతి విద్యార్థులకు పెద్ద రిలీఫ్. ఈనెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పదో పరీక్షలు జరగబోతున్నాయి. ఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అర్ధగంట లేటుగా హాజరైనా అనుమతించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా ఇన్విజిలేటర్లందరు అమలు చేయాలని స్పష్టంగా చెప్పారు.

మొన్నటి వరకు ఉన్న నిబంధన ఏమిటంటే పరీక్ష కేంద్రాలకు ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించేవారు కాదు. ఈ నిబంధన వల్ల ప్రతిసారి వేలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిజానికి పరీక్షకు సమయానికి రాకుండా కాస్త ఆలస్యమైనా నష్టపోయేది విద్యార్ధులే కానీ ప్రభుత్వం కాదు. విద్యార్ధులు పరీక్షకు కాస్త ఆలస్యంగా హాజరైతే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముంటుంది ?

పరీక్షలకు సమయానికి హాజరైనా ఆలస్యంగా హాజరైన విద్యార్ధులకైనా పరీక్ష రాయటానికి ఉండే సమయం 3 గంటలు మాత్రమే. కనీసం మొదటి అర్ధ గంట వరకు అయినా విద్యార్ధులకు వెసులుబాటు కల్పించాలని చాలామంది ప్రభుత్వాన్ని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.

అయినా ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. అలాంటిది ఇపుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్ధులకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఏ విద్యార్థి కూడా కావాలనే పరీక్షకు లేటుగా హాజరు కాడు. విద్యార్ధులు పరీక్షల సెంటర్లకు కాస్త లేటుగా హాజరయ్యారంటే తగిన కారణం ఉండే ఉంటుంది.

విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతుంటే 10 గంటల వరకు విద్యార్ధులను అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. 6.22 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వబోతున్నారు.

ఇదే సమయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పల్లెవెలుగు, సిటీ ఆర్డనరీ సర్వీసులో ప్రయాణించే విద్యార్ధులకు పాస్ అవసరం లేదని కూడా బొత్స చెప్పారు. పాస్ బదులు విద్యార్ధులు తమ హాల్ టికెట్లను చూపించి ఉచితంగా ప్రయాణం చేయచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ రెండు నిర్ణయాలతో విద్యార్ధులకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.