Begin typing your search above and press return to search.

ప్రయాణీకులకు భారీ ఊరట.. విమానం రద్దయితే 10వేలు ఇవ్వాల్సిందే..!

By:  Tupaki Desk   |   25 Dec 2022 12:30 AM GMT
ప్రయాణీకులకు భారీ ఊరట.. విమానం రద్దయితే 10వేలు ఇవ్వాల్సిందే..!
X
ఈ రోజుల్లో ఎక్కడికైనా అత్యంత త్వరగా వెళ్లాలంటే దానికి విమాన ప్రయాణం ఒక్కటే మార్గం. సామాన్యులు సైతం విమానంలో ఒక్కసారైనా ప్రయాణించాలని కలలు కంటారు. అంతలా ఆకట్టుకునే విమాన ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ప్లాన్ చేసుకుంటారు. నిత్యం విదేశాలకు వెళ్లే వారు సైతం తగిన ముందస్తు ప్లాన్ తోనే విమాన టికెట్లను బుక్ చేసుకుంటారని ప్రతి ఒక్కరికి తెలిసిందే.

అయితే విమాన ప్రయాణం కోసం ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఆకస్మికంగా విమానాలు రద్దయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. సాంకేతిక కారణాలు.. వాతావరణ పరిస్థితులు.. ఇతరత్రా కారణాలతో రోజుకు వందలాది విమానాలు రద్దవుతూనే ఉన్నాయి. ఈ కారణంగానే విమాన ప్రయాణికులు ఎన్నోసార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇటీవలీ కాలంలో ఇష్టారీతిన విమాయాన సంస్థలు రద్దు చేస్తుండటంతో ప్రయాణీకులు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కు పెద్దమొత్తంలో ఫిర్యాదులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు ప్రయాణీకులకు భారీ ఊరట కలిగించేలా ఉన్నాయి.

డీజీసీఏ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. విమానం రద్దు చేయాల్సి వస్తే సదరు సంస్థలు రెండు వారాల ముందుగానే ప్రయాణికులకు సమాచారం అందించడంతో పాటు వేరే విమానంలో సీటు కేటాయించాలి. రెండు వారాల నుంచి 24 గంటల లోపు రద్దు చేయాల్సి వస్తే ప్రయాణ సమయానికి రెండు గంటల్లోపు వేరే విమానం సిద్ధం చేయాలి. లేనట్లయితే టికెట్‌ రుసుం ప్రయాణికుడికి చెల్లించాలి.

24 గంటలలోపు అయితే టికెట్‌ రుసుముతోపాటు పరిహారం చెల్లించాలి. రెండు గంటల కంటే ఎక్కువ సమయమైతే అత్యధికంగా (వన్‌ వే ఫేర్‌ + ఇంధన ఖర్చు) రూ.10 వేలు చెల్లించాలి. గంట నుంచి రెండు గంటల మధ్య అయితే అత్యధికంగా రూ.7,500.. ఒక గంటలోపు అయితే అత్యధికంగా రూ.5 వేలు చెల్లించాలి.

బుకింగ్‌ కన్ఫర్మ్‌ అయ్యాక బోర్డింగ్‌కు అనుమతించకపోతే ప్రయాణ సమయానికి గంటలోపు వేరే విమానాన్ని సిద్ధంగా ఉంచాలి. 24 గంటలలోపు వేరే విమానాన్ని సిద్ధం చేయాల్సి వస్తే అత్యధికంగా రూ.10వేలు.. 24 గంటలు దాటితే అత్యధికంగా రూ.20 వేలు ప్రయాణికుడికి చెల్లించాలి.

తక్కువ క్లాస్‌ టికెట్‌ కేటాయిస్తే ప్రయాణికుడికి టికెట్‌ చార్జీలు.. ట్యాక్స్‌తో సహా చెల్లించాలి. తదుపరి అందుబాటులో ఉన్న క్లాసులో విమాన సంస్థ ఉచిత ప్రయాణం కల్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలన్నీ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీజీసీఏ పేర్కొంది. దీంతో ఇకపై విమాన ప్రయాణం రద్దయిన ప్రయాణికులు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.